అమ‌రావ‌తికి ఆక్టోపస్ బలగాలు..లాక్‌డౌన్ అమలుకు మూడంచెల వ్యూహం

అమ‌రావ‌తి ప్రాంతాల్లో లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మూడంచెల వ్యూహం అమ‌లు చేస్తోంది.

అమ‌రావ‌తికి ఆక్టోపస్ బలగాలు..లాక్‌డౌన్ అమలుకు మూడంచెల వ్యూహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 2:36 PM

అమ‌రావ‌తికి ఆక్టోపస్ బలగాలు..
అమ‌రావ‌తి అట్టుడుకుతోంది. క‌రోనా కోర‌ల్లో ప‌డి విల‌విల‌లాడుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి.. మంగళవారం ఉదయం 10 గంటల వరకునమోదైన కోవిడ్-19 పరీక్షల్లో.. మరో కేసు నమోదైంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి ప్రాంతాల్లో లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మూడంచెల వ్యూహం అమ‌లు చేస్తోంది.
* లాక్‌డౌన్ మరింత కఠినం గుంటూరు నగరంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత క్లిష్ట సమయాలలో మాత్రమే రంగ ప్రవేశం చేసే ఆక్టోపస్ బృందాన్ని గుంటూరు కు రప్పించినట్టు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో 4 ప్లాటూన్ ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాలలో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బంది విషయంలో పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర డీజీపి ఉద్యోగుల భద్రత విషయంలో వారికి అందించాల్సిన పరికరాలు, పాటించాల్సిన జాగ్రత్త‌ల‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న‌ట్లు తెలిపారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవసరమైన వాటిని సమకూరుస్తున్న‌ట్లుగా వివరించారు.
* మూడంచెల భద్రత లాక్‌డౌన్‌ నిబంధనలు పటిష్టంగా అమలయ్యేందుకు మూడంచెల భద్రత తో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మొదటి దశలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల ద్వారా అత్యవసర సర్వీసులు మినహాయించి గుంటూరు నగరానికి వెలుపలి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. రెండవ దశలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి కాంటైన్మెంట్‌ ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా నియంత్రించారు. మూడవ దశలో కాంటైన్మెంట్‌ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల్లో జనసంచారం పూర్తిగా నిషేధించిన‌ట్లుగా వివరించారు. గుంటూరు అర్బన్ పరిధిలో మొత్తం వెయ్యిమంది కి పైగా పోలీసులు విధినిర్వహణలో పాల్గొంటున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు సంచార బృందాలను ఏర్పాటు చేసి లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
* వెసులుబాటు దుర్వినియోగం చేయవద్దు. నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే నిమిత్తం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఇచ్చిన వెసులుబాటు ను దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ఆ సమయంలో ప్రజలంతా వారు నివసించే ప్రాంతానికి 1 లేదా 2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాటిని సమకూర్చుకోవాలని చెబుతున్నారు. ఈ వెసులు బాటును ఆసరాగా తీసుకొని వాకింగులు చేయటం, నగరమంతా సంచరించడం వంటివి చేయకూడదని హెచ్చ‌రిస్తున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే చాలా వరకు కట్టడి చేయవచ్చని వివ‌రిస్తున్నారు. ప్రజలంతా ఈ విషయం పై అవగాహణ‌ పెంపొందించుకోవాల‌ని స్వీయనియంత్రణ తో పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.