కృష్ణానగర్ వీధుల్లో.. కష్టాల కడలిలో.. సినీ కథా రచయిత శిధిల జీవితం!

Senior Writer Who Turns Beggar, కృష్ణానగర్ వీధుల్లో.. కష్టాల కడలిలో.. సినీ కథా రచయిత శిధిల జీవితం!

సినిమాలపై మోజుతో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌కు చేరుకుంటారు. ఏదో సాధించాలన్న తపన.. గుండెల్లో నమ్మకం.. ఎన్నో ప్రయత్నాలు.. కానీ చివరికి మోసపోయి.. అదే కృష్ణనగర్, ఫిల్మ్‌నగర్‌లో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా అభివృద్ధి చెందటంతో చాలామంది యువత సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. వారి ప్రతిభ నలుమూలలకు వ్యాపిస్తుండటంతో ఛాన్స్‌లు వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు సినిమాపై మోజుతో ఫిల్మ్‌నగర్‌కు వచ్చి.. ఛాన్సులు దొరక్క.. జీవితాలను నాశనం చేసుకుని రోడ్డున పడి కష్టపడుతున్న వారు ఇప్పటికీ కోకొల్లలు. అందులో ఒకరు కొండా రామారావు.

గత 55 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో గుర్తింపు దక్కించుకోవడానికి ఈయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రస్తుతం గుడి ముందు అడుక్కుంటూ.. ఫుట్‌పాట్‌పై తింటూ బ్రతుకు సమరంలో పోరాడుతున్నారు. నటుడిగా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రస్తుతం కథా రచయితగా మారారు. రోడ్డు మీద కూర్చునే పదుల సంఖ్యలో కథలు రాశారు. అయినా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.

చిన్న చిన్న పాత్రల్లో నటించించడానికి మొదట్లో చెన్నై వెళ్లిన రామారావు అక్కడ ఎన్టీఆర్, ఏఎన్నార్, జయలలిత వంటి వారి ఇంట్లో పని చేస్తూ ప్రయత్నాలు సాగించాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడంతో రామారావు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్‌గా అవతారమెత్తిన రామారావుకు ఒరిగింది ఏమి లేదు. పైగా ఆ తరుణంలోనే భార్య అంజమ్మ మృతి చెందటం.. ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్లడంతో రామారావు ఒంటరి అయ్యాడు.

రామారావు రోడ్డున పడ్డా ఆయనకు సినిమాలపై మోజు మాత్రం తగ్గలేదు. నటుడిగా రాణించలేనని తెలిసిన రామారావు ప్రస్తుతం పెన్ను పేపర్ పట్టి రచయితగా మారాడు. 100కి పైగా కథలు రోడ్డు మీద కూర్చునే రాశాడు. అందులో కొన్ని వర్షం వల్ల తడిసిపోయినా.. ఇంకా రాస్తూనే ఉంటానని.. తనను ఎవరూ గుర్తించకపోయినా.. ఎన్నో కథలు రాస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఒక్క రామారావు మాత్రమే కాదు.. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఫిల్మ్ నగర్, కృష్ణానగర్‌లలో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. పైకి చిన్న చిరునవ్వులు చిందిస్తున్నా.. లోపల మాత్రం చెప్పుకోలేని బాధ., తింటానికి డబ్బులు లేక.. పస్తులు ఉంటూ బ్రతుకు జట్కా బండిని సాగిస్తుంటారు. ఎవరిని కలవాలో తెలియదు.. పోనీ నిర్మాతల దగ్గరకు వెళ్దాం అంటే.. మేనేజర్లు.. వాచ్‌మెన్లు జేబులు ఖాళీ చేస్తారు. ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక.. అనుకున్నది సాధించలేక.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు తమదైన రోజు ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే జీవనం సాగిస్తుంటారు. ఇప్పటికైనా టాలీవుడ్ నిర్మాతలు కొత్త టాలెంట్‌ను కనిపెట్టడానికి ఏదైనా హంట్ మొదలుపెడితే.. ఇలాంటి వారి శిధిల  జీవితాల్లో ఆశాకిరణాలను మెరిపించగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *