తుంగభద్ర పునీతమవుతోంది.. పుష్కర స్నానంతో భక్తులు పులకించిపోతున్నారు.. మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

గంగా స్నానం.. తుంగా పానం అన్నట్టుగా భక్తులు వెల్లువెత్తుతున్నారు. గంగలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం తుంగభద్రలో స్నానమాచరిస్తే వస్తుందన్నది భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే తుంగభద్ర పుష్కరాలకు భక్తజనం రాక పెరిగింది..

  • Sanjay Kasula
  • Publish Date - 9:38 pm, Sat, 21 November 20

Tungabhadra Pushkara : తుంగభద్ర పునీతమవుతోంది. పుష్కర స్నానంతో భక్తులు పులకించిపోతున్నారు. పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. మంత్రాలయానికి  రెండో రోజు జనం క్యూ కట్టారు. గంగా స్నానం.. తుంగా పానం అన్నట్టుగా భక్తులు వెల్లువెత్తుతున్నారు. గంగలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం తుంగభద్రలో స్నానమాచరిస్తే వస్తుందన్నది భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే తుంగభద్ర పుష్కరాలకు భక్తజనం రాక పెరిగింది..

కర్నూలు జిల్లా తుంగభద్ర తీరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తుంగభద్ర పుష్కర స్నానం కోసం దేశ నలుమూలల నుంచి పోటెత్తారు. తుంగభద్రలో పుణ్యస్నానాలు చేసి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండ ప్రదానాలు, గంగమ్మకు హారతులిస్తున్నారు. అందులోనూ కార్తీక మాసం కావడంతో భక్తులు పుష్కరాలకు భారీగా తరలివస్తున్నారు.

తుంగభద్ర పుష్కర శోభను సంతరించుకుంది. నదీ తీరం భక్తజనంతో కళకళలాడుతోంది. పుణ్యస్నానాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా భక్తుల రద్దీ తగ్గలేదు. యథావిధిగా పుష్కర స్నానమాచరించి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.