ముంచుకొస్తున్న ముప్పు.. ‘ క్లైమేట్ ఎమర్జెన్సీ ‘ ప్రకటించిన శాస్త్రజ్ఞులు

మానవాళి మనుగడను దెబ్బ తీసే వాతావరణ ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రజ్ఞులు హెచ్ఛరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అప్పుడే ‘ క్లైమేట్ ఎమర్జెన్సీ ‘ ప్రకటించారు. ఈ భూమండలం త్వరలో వినాశనకర పరిస్థితులకు చేరువవువుతోందని 153 దేశాలకు చెందిన 11 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటినుంచే సరైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే మానవ జాతి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని వారు అంటున్నారు. ఇంత జరుగుతున్నా మనం మాత్రం ఏమీ జరగనట్టు మన పనులు మనం చేసుకుంటున్నామని, ఇటు […]

ముంచుకొస్తున్న ముప్పు.. ' క్లైమేట్ ఎమర్జెన్సీ ' ప్రకటించిన శాస్త్రజ్ఞులు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 5:29 PM

మానవాళి మనుగడను దెబ్బ తీసే వాతావరణ ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రజ్ఞులు హెచ్ఛరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అప్పుడే ‘ క్లైమేట్ ఎమర్జెన్సీ ‘ ప్రకటించారు. ఈ భూమండలం త్వరలో వినాశనకర పరిస్థితులకు చేరువవువుతోందని 153 దేశాలకు చెందిన 11 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటినుంచే సరైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే మానవ జాతి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని వారు అంటున్నారు. ఇంత జరుగుతున్నా మనం మాత్రం ఏమీ జరగనట్టు మన పనులు మనం చేసుకుంటున్నామని, ఇటు ప్రభుత్వాలు గానీ, సమాజం గానీ జరగనున్న భారీ నష్టం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఈ రీసెర్చర్లు విచారం వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. హిమ నదీనదాలు కరిగిపోతున్నాయి. ఇది మనకు ఏమాత్రం క్షేమదాయకం కాదు.. వ్యవసాయ రంగం నుంచి విద్యా రంగం వరకు అన్ని రంగాలనూ ప్రక్షాళన చేయాల్సిందే అని వీరు తమ అధ్యయన పత్రంలో సూచించారు. ఆయా దేశాల ప్రభుత్వాలు మొక్కుబడిగా, తాత్కాలిక చర్యలు చేపడుతున్నాయని, వీటివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీకి చెందిన ప్రొఫెసర్ విలియం రీఫిల్ దీనిపై మాట్లాడుతూ.. సామాజిక సమస్యలతో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి సంక్షేమాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్ టౌన్ లకు చెందిన ప్రొఫెసర్లతో బాటు అనేకమంది శాస్త్రజ్ఞులు ఈ స్టడీ పత్రంపై సంతకాలు చేశారు. ఈ వివరాలను వారు బయో సైన్స్ పత్రికలో ప్రచురించారు. ప్యారిస్ లో క్లైమేట్ అగ్రిమెంట్ కుదిరి మూడేళ్లు అయిన సందర్భంగా (ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్) ఈ నెల 4 న జరిగిన కార్యక్రమం అనంతరం వీరంతా ఈ హెచ్ఛరిక చేశారు. ఆశ్చర్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇక కేవలం 12 సంవత్సరాల కాలం మాత్రమే మిగిలి ఉంది.. అందువల్ల డ్రాస్టిక్ యాక్షన్ తప్పనిసరి అని ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ ను దాటకముందే త్వరపడాలన్నారు. ఇప్పటికే బ్రిటన్, పోర్చుగల్, కెనడా, అర్జెంటీనా లతో బాటు 23 దేశాలు క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇలా ఉండగా.. ఇండియాతో బాటు అమెరికా, చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో సముద్ర మట్టాలు పెరిగాయని, ఇందుకు గ్లేసియర్, ఐస్ షీట్స్ కారణమవుతున్నాయని జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు. 2300 నాటికి అన్ని ప్రపంచ దేశాల్లో సముద్ర మట్టాలు ఒక మీటరుకు పైగా పెరుగుతాయని వీరు అంచనా వేశారు. కర్బన కాలుష్యాలను తగ్గించకపోతే పెను ప్రమాదం తప్పదని వీరు కూడా ఈ దేశాలను హెచ్ఛరిస్తున్నారు. వాయు, జల కాలుష్యాల వల్ల ముప్పు సమీపంలోనే ఉందని కూడా అంటున్నారు. స్వీడన్ కు చెందిన 16 ఏళ్ళ గ్రెటా థగ్ బెర్గ్ పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన ఉద్యమం నేపథ్యంలో మనం ఇప్పటినుంచే జాగ్రత్త పడాలని ఈ ప్రొఫెసర్లు కోరుతున్నారు.