ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్… తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు

SBI announces special car personal education loan benefits ahead of festive season, ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్… తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే వడ్డీ రేట్ల మార్పులకు సంబంధించి ఈ రుణాలపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని వివరించింది. యోనో వంటి సొంత డిజిటల్‌ ప్లాట్‌ఫాం నుంచి లేదా వెబ్‌సైట్‌ ద్వారా కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వడ్డీపై 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) మేర తగ్గింపు కూడా పొందవచ్చు. వేతన జీవులు కారు ఆన్‌ రోడ్‌ ధరలో 90 శాతం దాకా రుణంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయన్నది మాత్రం ఎస్‌బీఐ వెల్లడించలేదు.

సెప్టెంబర్‌ 1 నుంచి ప్రస్తుత, కొత్త గృహ రుణాలన్నింటికి రెపో రేట్‌ ఆధారిత వడ్డీ రేట్లు వర్తింపచేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇటీవలే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా గృహ రుణాలపై వడ్డీ రేటు 35 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింది. మరోవైపు రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేటు అత్యంత తక్కువగా 10.75% నుంచి ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *