Sankranti Festival : దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రకాలుగా జరుపుకునే పంటల పండుగ సంక్రాంతి!

సంక్రాంతి అంటే తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ. పంటల పండుగన్నా, పెద్దల పండుగన్నా, పశువుల పండుగన్నా సంక్రాంతే..

Sankranti Festival : దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రకాలుగా జరుపుకునే పంటల పండుగ సంక్రాంతి!
Follow us

|

Updated on: Jan 12, 2021 | 3:52 PM

సంక్రాంతి అంటే తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ. పంటల పండుగన్నా, పెద్దల పండుగన్నా, పశువుల పండుగన్నా సంక్రాంతే! అసలు మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! ఆ మాటకొస్తే బీడు నేలను దుక్కిదున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి తొలి పండుగ ఇదే! అందుకే సంక్రాంతిని అంత గొప్పగా జరుపుకుంటాం! మనమే కాదు..దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు. ఆచారాలు వేరు. పద్దతులు వేరు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని వివిధ రకాలుగా జరుపుకుంటారు.. సంక్రాంతి పండుగ ఒక్క తెలుగింటనే మురిపంగా జరగదు. భారతదేశమంతటా సంక్రాంతి సంతోషమే ! భారతావని అంతా ఆనందాల సంబరమే ! భిన్న సంస్కృతులకు ఆలవాలమై, విభిన్న సంప్రదాయాలకు సంగమమై విరాజిల్లుతోన్న మన దేశంలో ఇది ఒక అపురూప వేడుక! సంక్రాంతి సమయంలో సూర్య భగవానుడిని ఆరాధించడం మన దేశపు అతి ప్రాచీన సంప్రదాయం. ఈ సందర్భంగా జరిగే వ్యవసాయ సంబంధిత సామాగ్రికి పూజలు చేయడం, ఎడ్ల పందాలను నిర్వహించడం, భోగిమంటలు వేయడం ఇలాంటివి ఇప్పటి రూపంలో కాకపోయినా అప్పట్నుంచే ప్రారంభమై ఆనవాయితీగా వస్తున్నాయి. క్రమ క్రమంగా పంటలు చేతికొచ్చే పుష్యమాసంలో జరిగే ఉత్సవాల రూపాంతరమే సంక్రాంతి పండుగ.

పంజాబీలకు సంక్రాంతి ముఖ్యమైన పండుగ. కాకపోతే మనకంటే ఒక రోజు ముందే ఈ పండుగను జరుపుకుంటారు. మన సంక్రాంతి పండుగను పంజాబీలు లోహ్రీ ఉత్సవ్‌గా పిలుచుకుంటారు. భోగి కంటే ముందు రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరిస్తారు. మహిళలు ఆభరణాలు అలంకరించుకుంటారు. మనలాగే భోగి మంటలు వేస్తారు. ఆట పాటలతో అగ్ని దేవుడిని పూజిస్తారు. నువ్వులతో చేసిన స్వీట్లను అగ్నికి ఆహుతి చేస్తారు.. భోగి మంటల చుట్టూ తిరుగుతూ, శ్రావ్యమైన పాటలు పాడుతూ, భజనలు చేస్తూ రాత్రంతా గడుపుతారు.. నువ్వులు, పల్లీలు, మొక్కజొన్న, బెల్లంతో తయారు చేసిన మిఠాయిలను ప్రసాదంగా పంచుతారు.. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరంలో మొదటి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. మహారాష్ర్టలో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. మరాఠీయులు సంక్రాంతిని మకర్‌ సంక్రాంతిగా పిల్చుకుంటారు. భోగి రోజు నువ్వులతో కలిపిన సజ్జ రొట్టెలను చేస్తారు. ఆ రోజున ప్రత్యేకంగా భోగి కూర వండుతారు. ఇంటి ముందు అందమైన రంగవల్లికలను తీర్చి దిద్దుతారు. చెరకు గడలు, రేగుపండ్లు, గెనుసు గడ్డలు, చిలకడ దుంపలు, తమలపాకులు, నవధాన్యాలు, అందంగా అలంకరించిన చిన్న చిన్న మట్టి కుండలు పెట్టి భోగి పూజ చేస్తారు. సంక్రాంతి రోజున మహిళలందరూ విఠలేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నువ్వులు, బెల్లం, పసుపు కుంకుమ, తమలపాకులతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందడిగా గడుపుతారు. రకరకాల మిఠాయిలు చేస్తారు. నువ్వుల లడ్డు మాత్రం తప్పనిసరి! ముత్తయిదువలు హల్దీ కుంకుమ్‌ ఉత్సవ్‌ పేరుతో ఇరుగుపొరుగు వారిని ఇంటికి పిలిచి కొత్త పాత్రలో పసుపు కుంకుమ ఇస్తారు..

రాజస్థానీయులకు కూడా ఇది పెద్ద పండుగే! మనలాగా మూడు రోజుల పండుగ కాదు. వీరికి ఇది ఒకరోజు పండుగే! కొత్తగా పెళ్లయి అత్తారింటికి చేరిన ఆడపడచులంతా పుట్టింటికి వెళతారు. తల్లిదండ్రులు, సోదరులు ఇచ్చే ఆత్మీయ బహుమతులను ఆనందంగా స్వీకరిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడపడచులకు బట్టలు పెట్టడం సంప్రదాయం. అలాగే గేవర్‌గనీ, నువ్వుల లడ్డు వంటి స్వీట్లను ఇచ్చి కలకాలం ఆనందంగా ఉండమంటూ దీవిస్తారు. అదే రోజు మట్టి కుండలో బియ్యం, పెసర్లు, చెరకు గడలు, రేగిపండ్లు, ముల్లంగి, గెనుసుగడ్డ వేసి రంగవల్లికలో ఉంచుతారు. తమిళ ప్రజలు సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. తమిళులకు ఇది పెద్ద పండుగ. వీరు కూడా సంక్రాంతిని మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. వేకువ జామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దుతారు. ఇంటి ఇలవేలుపుకు పూజలు చేస్తారు. పొంగలిని నైవేద్యంగా పెడతారు. మరికొందరు బియ్యం, రకరకాల పప్పు దినుసులు, పాలు, నెయ్యి కలిపి కిచిడి తయారు చేస్తారు. దాన్నే కులదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతి రోజున ఖిచిరి పేరుతో నదులలో పుణ్య స్నానాలు చేస్తారు. పండుగకు నెల రోజుల ముందునుంచే మాఘ మేళా పేరుతో నదులలో పుణ్య స్నానాలు చేసే సంప్రదాయం మొదలవుతుంది.. త్రివేణి సంగమం.. ప్రయాగ.. హరిద్వార్‌లు భక్తులతో కిటకిటలాడిపోతాయి.. అలాగే బెంగాల్‌లో కూడా ప్రజలంతా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. మధ్యప్రదేశ్‌లో సకారత్ పేరుతో సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రకరకాల పిండివంటలు చేసుకుని, ఒకరికొకరు పంచుకుంటారు. ఒడిషాలోని కొన్ని గిరిజన తెగలకు సంక్రాంతి పండుగ నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. నెగడు వెలిగించి, దాని చుట్టూ పాటలతో నృత్యాలు చేస్తారు.. అస్సాంలో మాఘ్‌ బిహు లేదా భోగలీ బిహూ అని, కశ్మీర్‌లో శిశుర్‌ సంక్రాంత్‌ అని వ్యవహరిస్తారు. అస్సామీలకు ఇది కొత్త సంవత్సరం. ప్రజలంతా సంబరంగా జరుపుకునే పండుగ. సంప్రదాయ పిండివంటలు సరేసరి! ఇక తెల్లారగానే ప్రజలంతా చెరువు చెంతకు చేరుకుంటారు. ఎందుకంటే చేపలు పట్టడానికి! ఈ సంబరాన్ని ఉరుగా అంటారు. చేపలు పట్టడం కోసమే ప్రత్యేకంగా చెరువులుంటాయి. ఏడాది మొత్తంలో ఇదొక్క రోజే చేపలను పడతారు. చేపలు పట్టడం అయ్యాక వెదురుతో ప్రత్యేకంగా కుటీరాలను నిర్మిస్తారు. పండుగ రోజంతా అక్కడే మకాం చేస్తారు. మహిళలంతా ప్రత్యేకమైన వంటకాల తయారీలో నిమగ్నమైతే, పురుషులంతా సంప్రదాయ వంటలు వండుతారు. మాఘ్ బిహు రోజున ఆ కుటీరాలను అగ్నికి ఆహుతి ఇస్తారు. ఇక్కడ కూడా దున్నపోతుల పోట్లాటలు, కోడి పుంజులు కొట్టుకోవడాలు ఉంటాయి..

ఇక గుజరాత్‌లో అయితే చెప్పనే వద్దు. మకర్‌ సంక్రాంతి పేరిట గుజరాతీయులు చాలా గొప్పగా చేసుకుంటారు ఈ పండుగను. ఆ రోజున అహ్మదాబాద్‌లోని నీలాకాశం రకరకాల రంగులు మార్చుకుంటుంది.. ఆకాశమంతటా ఆవరించుకున్న గాలిపటాలు రంగురంగుల పూలలా అనిపిస్తాయి. అగుపిస్తాయి. అసలు ఈ వేడుకను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యారాధన ఒక్క మన భారతావనిలోనే కాదు.. ప్రపంచమంతటా కనిపిస్తుంది. మహోజ్వలంగా వెలుగొందిన అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ సూర్యారాధన కనిపిస్తుంది. అంతకు ముందు ఆదిమవాసులు సూర్యుడిని గొప్ప వేటగాడిగా కొలుచుకున్నారు. పూజించారు.. ఎన్నో దేశాలు.. రాజవంశాలు సూర్యుడి పేరుతో అవతరించాయి.. శ్రీరాముడు సూర్యవంశపు రాజే! ఈజిప్టు, జపాన్‌, మెక్సికో, పెరూ, ప్రాచీన ఇరాన్‌-ఇరాక్‌ మొదలైన దేశాలలో సూర్యుడిని భగవంతుడి స్వరూపంగా కొలుస్తారు. సూర్యారాధనలోంచే సంక్రాంతి వచ్చింది. సంక్రాంతిని గ్రీకులు బేకస్‌ అని పిలుచుకుంటే రోమన్లు బ్యాకన్‌ అని అంటారు.

నేపాల్‌లోని థారూ ప్రజలు ఈ పండగని మాఘీగా, ఇతరులు మాఘే సంక్రాంతిగా జరుపుకుంటారు. ఎద్దుల పోటీలు ఈ పండుగ ప్రత్యేకం ఇక్కడ! రెండు వృషభాలు పోట్లాడుతుంటే జనం కేరింతలు కొడతారు. అచ్చంగా మన కోడి పందాల్లో మాదిరిగానే! మాఘీ రోజున వేకువజామునే పశుపతి ఆలయం వెనుక ఉన్న భాగమతీ నదిలో స్నానమాచరిస్తారు. కుదరనివాళ్లు గండకి నదిలో పుణ్యస్నానమాచరిస్తారు. ఇంటి ముంగిట ముగ్గులు వేస్తారు.. ముగ్గు మధ్యలో పువ్వులు, పసుపుకుంకుమలు, రాగి నాణేలు ఉంచుతారు. ఇంట్లో శివలింగానికి పూజలు చేసి, పశుపతినాథుడిని దర్శించుకుంటారు. కంబోడియాలో జరిగే మోహ సంగ్‌క్రాన్‌ కూడా అంతే! ఇది కూడా వారికి కొత్త సంవత్సరమే! కాకపోతే ఇది ఏప్రిల్‌ 13న వస్తుంది.. సంస్కృతంలో మహా సంగ్‌క్రాంత కాస్త మోహసంగ్‌క్రాన్‌గా మారింది.. ఈ పండుగను కంబోడియా వాసులు మూడు రోజులు జరుపుకుంటారు. బౌద్ధ ఆలయాలకు వెళ్లి ఆరాధనలు చేస్తారు. బుద్ధుడికి అభిషేకం చేస్తారు. అగరొత్తులు వెలిగిస్తారు. ఏడాదంతా మంచే జరగాలని ప్రార్థిస్తూ పవిత్ర జలంలో ఉదయం ముఖం కడుక్కుంటారు. మధ్యాహ్నం ఛాతీని, సాయంత్రం పాదాలను కడుగుతారు. ఇక లావోస్‌లో జరిగే పిమలావో పండుగ కూడా ఇదే సీజన్‌లో జరుగుతుంది.. ఇది కూడా వారికి నూతన సంవత్సరమే! నిజానికి లావోస్‌ ప్రజలకు ఇదే పెద్ద పండుగ. బుద్ధుడికి అభిషేకాలు, పూజలు మామూలే! థాయ్‌లాండ్‌లోలా ఇక్కడ కూడా నీళ్లు చల్లుకునే ఆట ఉంది. అందుకే వీధులన్నీ జనంతో నిండిపోతాయి.. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ పండుగలోని మజాను ఆస్వాదిస్తారు.