పేలుతున్న మాటలు..మైత్రికి బీటలు..శివసేన వ్యూహం అదేనా ?

శివసేన మాటల తూటాలు పేలుస్తూనే వుంది. మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటులో తాము ఏ మాత్రం తగ్గేది లేదన్న సంకేతాల్నిస్తూనే వుంది. తాజాగా సంజయ్ రౌత్ మరోసారి చెలరేగిపోయారు. బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని కుండ బద్దల కొట్టారు. ఇంకో అడుగు ముందుకేసి బిజెపి బెదిరింపులకు భయపడేందుకు శివసేనలో దుశ్యత్ చౌతాలా లాంటి జైల్లో మగ్గుతున్న తండ్రులున్న వారెవరూ లేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి […]

పేలుతున్న మాటలు..మైత్రికి బీటలు..శివసేన వ్యూహం అదేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 6:18 PM

శివసేన మాటల తూటాలు పేలుస్తూనే వుంది. మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటులో తాము ఏ మాత్రం తగ్గేది లేదన్న సంకేతాల్నిస్తూనే వుంది. తాజాగా సంజయ్ రౌత్ మరోసారి చెలరేగిపోయారు. బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని కుండ బద్దల కొట్టారు. ఇంకో అడుగు ముందుకేసి బిజెపి బెదిరింపులకు భయపడేందుకు శివసేనలో దుశ్యత్ చౌతాలా లాంటి జైల్లో మగ్గుతున్న తండ్రులున్న వారెవరూ లేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్‌ ఎవరూ ఇక్కడ లేరు’ అంటూ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ- శివసేన అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. కాగా బీజేపీతో పొత్తు ఖరారైన నాటి నుంచి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించడంతో పాటుగా కేబినెట్‌లో కూడా సముచిత స్థానం కల్పించాలని శివసేన… బిజెపిని డిమాండ్‌ చేస్తోంది.

అంతేగాకుండా తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాత్రం సీఎం పదవి పంచుకునేందుకు సుముఖంగా లేనట్లుగానే కనిపిస్తోంది. దీంతో శివసేన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్‌- ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు జారీ చేస్తోంది.

అయితే శివసేనతో కలిసే ప్రసక్తే లేదని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం పరిణామాలను చూస్తూ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగానే గవర్నర్‌తో భేటీ అవడంతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘ బీజేపీ, మేము ఉమ్మడిగానే ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మేము ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించుకునే విధంగా బీజేపీ మాతో పాపం చేయించకూడదు. రాజకీయంలో సన్యాసులు ఎవరూ ఉండరు. పైగా ఇక్కడ దుష్యంత్‌ ఎవరూ లేరు. ఎవరి తండ్రైతే జైలులో ఉన్నారో ఆయన.. ఇక్కడ మేము ధర్మబద్ధమైన, నిజాయితితో కూడిన రాజకీయాలే చేస్తాం. కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 స్థానాలు కైవసం చేసుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలాతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

దుష్యంత్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టిన బీజేపీ కేబినెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక దుష్యంత్‌ ప్రమాణ స్వీకారానికి జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్‌ చౌతాలా పెరోల్‌పై బయటకు వచ్చిన నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అధికారంలో ఉన్న సమయంలో అజయ్‌ చౌతాలా ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.