తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా సబితమ్మ రికార్డు!

Sabitha indra reddy questions cm kcr and gets minister post in telangana cabinet, తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా సబితమ్మ రికార్డు!

గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మంత్రివర్గం లేకుండానే పాలన సాగింది. తొలివిడత మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మందికి అవకాశం ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి వారికి చోటు లభించలేదు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో వీరు మంత్రి పదవులు నిర్వహించడం, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఈరోజు జరిగిన మంత్రివర్గ రెండో విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావులకు చోటు కల్పించారు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కల్పించారు.ఇప్పటి వరకూ మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరింది.

సబితా ఇంద్రారెడ్డి రికార్డు:

తొలివిడత ప్రభుత్వంలో కేసీఆర్ మహిళా మంత్రులకు స్థానం కల్పించకపోవటంపై రాజకీయంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. అసెంబ్లీలో ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డినే మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించమని కోరారు. అప్పుడు కేసీఆర్ త్వరలోనే తీసుకుంటామని హామి ఇచ్చారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు కేసీఆర్ స్థానం కల్పించారు. వీరిలో తొలుత సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రి ఆమె అయ్యారు.  విద్యా శాఖ ఆవిడను వరించింది. ఆ తర్వాత సత్యవతి రాథోడ్ రెండో మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2000 సంవత్సరంలో మొదటిసారి చేవేళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు సబితా ఇంద్రారెడ్డి. 2004లోనూ చేవేళ్ల నుంచి గెలుపొందిన ఆమె.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహేశ్వరం నుంచి పోటీ చేశారు. 2004 నుంచి 2009 మధ్య గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో వైఎస్ కేబినెట్లో కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హోంశాఖ పదవి చేపట్టిన తొలి మహిళగా సబిత రికార్డు సృష్టించారు. 2014లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయిన సబిత, 2018 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్ఎస్ లో చేరిన సబితకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కేసీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *