GHMC Elections: త్వరలో జీహెచ్ఎంసీకి ముందస్తు!

ఏడాది కాలంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిపోవడంతో ఇక ఇప్పట్లో ఎన్నికలేవీ లేవని అనుకుంటున్నారంతా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అందుకు భిన్నంగా వుంది.

GHMC Elections: త్వరలో జీహెచ్ఎంసీకి ముందస్తు!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 5:24 PM

KCR thinking to preponement of GHMC elections: ఏడాది కాలంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిపోవడంతో ఇక ఇప్పట్లో ఎన్నికలేవీ లేవని అనుకుంటున్నారంతా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అందుకు భిన్నంగా వుంది. నవంబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక, స్థానిక సంస్థలు, మునిసిపల్, సహకార ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. ప్రతీ ఎన్నికల్లో అనూహ్యమైన ఘన విజయాలను సొంతం చేసుకుని.. రాష్ట్రంలో విపక్షాలు ఇంత వీకా? అని అనుకునేలా చేసింది గులాబీ దళం.

సహకార ఎన్నికలు కూడా ముగియడంతో ఇక ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవని అంతా అనుకుంటున్నారు. కానీ.. కేసీఆర్ ఆలోచన మరో రకంగా వుందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ఇదే ఊపులో కానిచ్చేస్తే బావుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 99 డివిజన్లలో గెలుపొందింది. తిరుగులేని ఆధిక్యంతో జీహెచ్ఎంసీ మీద పట్టు సాధించింది టీఆర్ఎస్ పార్టీ.

2021లో మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి వుండగా.. ఏడాది ముందే వాటిని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విముఖంగా వున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ ఈ అభిప్రాయాన్ని గత నెలలో బాహాటంగానే వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ.. కేటీఆర్ ప్రకటించినా.. జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలకు సంబంధించిన వార్తలు ఆగడం లేదు. తాజాగా ఏప్రిల్, మేనెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరందుకుంది. ఇంతకీ కేసీఆర్ మదిలో ఏముందో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.