నాలుగేళ్ల కొడుకుతో సహా దంపతుల ఆత్మహత్య

ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రైల్వే ఉద్యోగి భార్యాబిడ్డలతో పాటు తానూ నిప్పంటించుకుని అగ్నికి అహుతి అయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:50 pm, Wed, 4 November 20

ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రైల్వే ఉద్యోగి భార్యాబిడ్డలతో పాటు తానూ నిప్పంటించుకుని అగ్నికి అహుతి అయ్యారు. ప‌ర్బ వ‌ర్ధ‌మాన్ జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో దంపతులతో పాటు నాలుగేండ్ల కుమారుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. 11 ఏండ్ల బాలిక మాత్రం త‌ప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ‌ర్ద‌మాన్ జిల్లా మంటేశ్వ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మిస్ట్రిపార గ్రామానికి చెందిన సుదేవ్ డే (38) రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న‌ట్టుండి అత‌డు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి భార్య‌బిడ్డ‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ముందుగా భార్య రేఖ, కుమారుడు స్నేహాన్షులుపై కిరోసిన్ పోసి తగుల‌బెట్టి, అనంత‌రం త‌న‌పై తాను కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. ముగ్గురు అక్కడిక్కడే సజీవదహనమయ్యారు. అయితే, సుదేవ్ 11 ఏండ్ల కూతురు ఈ ఘ‌ట‌న నుంచి త‌ప్పించుకుంది.

బాలిక ఇచ్చిన స‌మాచారంతో సుదేవ్ బంధువులు హుటాహుటిన అత‌ని ఇంటికి చేరుకునేసరికి , అప్ప‌టికే సుదేవ్, రేఖ‌, స్నేహాన్షులు కాలిబూడిదయ్యారని పోలీసులు తెలిపారు. సుదేవ్ బంధువులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు కేసు నమోదు చేసుకుని మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం త‌ర‌లించామ‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు పోలీసులు.

తెల్ల‌వారు జామున ఒంటిగంట‌కు మా నాన్న న‌న్ను నిద్ర‌లేపాడు. మ‌రికాసేప‌ట్లో మ‌నం అంద‌రం చ‌నిపోబోతున్నాం అని చెప్పాడు. దీంతో భ‌య‌మేసి బ‌య‌ట‌కు ప‌రుగుతీశానని ప్రాణాలతో బయటపడ్డ కూతురు తెలిపింది. నాన్న‌నే మా అమ్మ రేఖ‌, త‌మ్ముడు స్నేహింశుల‌పై కిరోసిన్ పోసి త‌గుల‌బెట్టాడు. తానూ కూడా కిరోసిన్ పోసుకుని చ‌నిపోయాడు అని విల‌పిస్తూ చెప్పింది బాలిక.