బీహార్ ఎన్నికలుః ఆర్జేడీ మేనిఫెస్టో విడుదల చేసిన తేజస్వీ యాదవ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ శనివారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 11:42 am, Sat, 24 October 20

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న అధికార ఎన్డీయే కూటమి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. అయితే, ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ ముందుగా మేనిఫెస్టోను ప్రకటించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ శనివారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈసారి ఆయా పార్టీల మేనిఫెస్టోలన్నీ ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ 19 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటిస్తే, ప్రత్యర్థి ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే కరోనా నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు అన్ని పార్టీలు వాగ్ధానం చేస్తున్నాయి.

పది లక్షల ఉద్యోగాల ప్రకటన సాధ్యమయ్యే పనేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. 4 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా ఇవ్వగలమని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ 2.13 లక్షల కోట్లని, కానీ 60 శాతం మాత్రం నిధులను మాత్రమే నితీష్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మిగితా 40 బడ్జెట్‌ను ఖర్చు చేసే స్థితిలో కూడా సీఎం నితీశ్ లేరని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘బిహార్‌ను అన్ని రంగాల్లోనూ మెరుగ్గా చేయాలన్నది మా ప్రయత్నం. ఇందుకోసం జాతీయ ఉపాధి సగటుతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు తేజస్వీ యాదవ్. ఇది మార్పు కోసం మేమిచ్చే వాగ్దానం. ఇదో ప్రతిజ్ఞ. దానిని ఆచరణలోకి తెచ్చి చూపిస్తామని తేజస్వీ ప్రకటించారు. బీహార్‌ను నడిపే శక్తి సీఎం నితీశ్‌కు ఎంత మాత్రమూ లేదని, ఆయన అలిసిపోయారంటూ ఆయన చురకలు అంటించారు. యువ నాయకత్వంలో బీహార్ అన్ని విధాలు అభివృద్ధి జరుగుతదని తేజస్వీ యాదవ్ భరోసా ఇచ్చారు.

ఆర్జేడీ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రధానాంశాలుః

  • నిరుద్యోగులకు నెల చొప్పున 1,500 రూపాయలు
  • ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రుల నిర్మాణం
  • ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీల ఏర్పాటు
  • కొత్త పరిశ్రమల విధానం
  • ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ, ప్రభుత్వ పరీక్షలకు గానీ స్థానికులకు ఫీజుల మినహాయింపు
  • పేదలకు, వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్