ప్రశ్నించే గొంతుకకు అనూహ్య విజయం

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్​ నేత రేవంత్​ రెడ్డి అనూహ్య విజయం సాధించారు. క్షణక్షణం ఉత్కంఠ రేపిన మల్కాజిగిరిలో చివరికి విజయం రేవంత్​నే వరించింది. తొలి రౌండ్​ నుంచి… తెరాస, కాంగ్రెస్​ మధ్య ఆధిక్యత దోబూచులాడింది.

అసెంబ్లీ ఫలితాల్లో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించి రేవంత్​ను పోటీకి నిలిపింది. ప్రశ్నించే గొంతుకకు మద్దతు ఇవ్వండంటూ… రేవంత్​ రెడ్డి చేసిన ప్రచారం కాంగ్రెస్​కు కలిసొచ్చింది. పార్లమెంట్​ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రేవంత్​ సుడిగాలి పర్యటన చేశారు. రేవంత్​కు ప్రత్యర్థిగా ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజశేఖర్​రెడ్డి రాజకీయాలకు కొత్త కావడం కాంగ్రెస్​కు కలిసొచ్చిన మరో అంశం.కొడంగల్​లో ఘోర పరాభవం తాలూకు సానుభూతి మల్కాజిగిరి ఓటర్లలో కనిపించింది. సీమాంధ్ర సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న మల్కాజిగిరిలో రేవంత్​ రెడ్డి వ్యక్తిగతంగా ప్రభావం చూపగలిగారు. తనకున్న రాజకీయానుభవం, వాగ్దాటితో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు రేవంత్​. పట్టణ ప్రాంతవాసులు మద్దతు కచ్చితంగా లభిస్తుందన్న నమ్మకంతో… స్లమ్ ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 31లక్షల 49 వేలకు పైగా ఓటర్లున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర శివారు ప్రాంతం అయినందున… జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిర పడ్డవారు కాస్త ఎక్కువగానే ఉన్నారు. అందుకే మినీ భారత్​ అని కూడా పిలుచుకుంటారు. శాసనసభ ఫలితాలతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ లోక్​సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే… బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని యోచించింది. మల్కాజిగిరి స్థానం నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్​ రెడ్డిని ఎంపిక చేసింది. నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యే ఒక్కరూ లేనప్పటికీ రేవంత్ విజయం సాధించడం నిజంగా గొప్ప విషయం. పోలింగ్​ తక్కువగా నమోదైనా… ఫలితాలు తనకే అనుకూలంగా ఉంటాయని ముందునుంచే విశ్వాసంతో ఉన్నారు రేవంత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *