రేవంత్ రెడ్డి డిమాండ్లకు అధిష్టానం తలొగ్గుతుందా..?

Revanth reddy Fires On Uttam Kumar Reddy Decision About Huzurnagar bypolls, రేవంత్ రెడ్డి డిమాండ్లకు అధిష్టానం తలొగ్గుతుందా..?

కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చు రేగింది. మొన్నటి వరకు యురేనియం చిచ్చు అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో చిచ్చు చెలరేగింది. అదే హుజూర్ నగర్ ఉప ఎన్నిక. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్థానానాకి రాజీనామా చేయడంతో.. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది. ఉత్తమ్ నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే హుజూర్ నగర్ స్థానం నుంచి గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎంపీగా కూడా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ఇక్కడి స్థానానికి ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నోటీఫికేషన్ ఇవ్వబోతుంది. దీంతో ఈ స్థానం నుంచి ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఆయన పార్టీ అధిష్టానంకు సంబంధం లేకుండానే ఆ స్థానం నుంచి తన శ్రీమతి పద్మావతి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఉత్తమ్ కుమార్ ప్రకటనపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధిష్టానం సూచనలు – ఆదేశాలు లేకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ రేవంత్ మండిపడుతున్నారు. ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధిష్టానాన్ని డిమాండ్ చేయబోతున్నట్లు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ స్థానానికి తన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌ రేసులో ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు. అయితే మొన్నటి వరకు ఉత్తమ్‌కు సన్నిహితుడిగా ఉన్నా కిరణ్ కుమార్.. ఇటీవల రేవంత్ టీంలోకి జంప్ అయ్యారు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండిపడ్డారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారు అభ్యర్థులను ప్రకటించడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాదు మా జిల్లాలో రేవంత్ పెత్తనమేంటంటూ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. మొన్నటి వరకు ఉత్తమ్‌పై బహిరంగ వేదికలపై నుంచే విమర్శించిన వెంకట్ రెడ్డి.. అనూహ్యంగా ఉత్తమ్‌కు మద్ధతు పలికారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తీరుపై వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాలోని కార్యకర్తలంతా పద్మావతి పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారని కోమటి రెడ్డి అన్నారు. పార్టీలో పదవులు వచ్చినా రాకపోయినా తాను మాత్రం పార్టీ కోసమే పనిచేస్తానని కోమటిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం కలకలం రేపుతోంది. అలాగే అభ్యర్థిత్వం ప్రకటించే విషయంలో అధిష్టానం ఉత్తమ్ ప్రకటనను రద్దు చేయాలని.. అధిష్టానమే అభ్యర్థిని ప్రకటించాలని.. రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి రేవంత్ డిమాండ్‌కు అధిష్టానం తలొగ్గుతుందా..? ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తే.. దాని పరిస్థితి ఏలా ఉంటుంది..? టీపీసీసీ హోదాలో ఉన్న ఉత్తమ్‌కు ఒకవేళ అధిష్టానం నోటీసులు జారీచేస్తే.. ఆయన హోదాకే ప్రమాదం ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అదే సమయంలో రేవంత్ డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోతే.. అప్పుడు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రేవంత్ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరికొద్ది రోజులు వేచి చూస్తే.. అసలు హుజూర్ నగర్‌ బరిలో ఎవరు ఉంటారన్నది తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *