ఏపీలో కాపు రిజర్వేషన్లకు స్వస్తి!

Reservation for Kapus, ఏపీలో కాపు రిజర్వేషన్లకు స్వస్తి!

ఏపీలో కాపు రిజర్వేషన్‌కు ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్రం ఆర్థిక బలహీనవర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) ప్రకటించిన పదిశాతం కోటాలో ఐదు శాతాన్ని కాపులకు, మరో ఐదు శాతాన్ని కాపేతర వర్గాలకు కేటాయిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. అయితే, ఈ రిజర్వేషన్లపై వివిధ కోర్టుల్లో కేసులు ఉన్న నేపథ్యంలో .. వాటిని అమలుచేయలేమని కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం తేల్చివేసింది. కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్‌ పదిశాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తొలి విడతగా విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ల అమలుపై మార్గదర్శకాలు జారీచేసింది. ఇందులో కాపు రిజర్వేషన్లు ఉండవని తేల్చింది. ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై మరో జీవోను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్‌ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం… ఈడబ్ల్యూఎస్‌ 10శాతం రిజర్వేషన్లలో విద్యాసంస్థల్లో సీట్లకు సంబంధించి విభజన కుదరదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్‌ పరిధిలోని అందరికీ వర్తించాలని, దాన్ని వేర్వేరుగా వర్గాలకు వర్గీకరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పును తన ఉత్తర్వుల్లో ఉటంకించింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు తాజా ఉత్తర్వులు వర్త్తిస్తాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *