Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

జగన్ హస్తినకు వెళ్లడానికి కారణం అతనేనట!

reason behind jagan tour, జగన్ హస్తినకు వెళ్లడానికి కారణం అతనేనట!

కమలం, ఫ్యాన్ గుర్తు పార్టీల మధ్య దోస్తీ కుదిరింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందనే ప్రచారం గుప్పుమంటోంది. అది నిజమా కాదా అనే సంగతి పక్కన పెడితే ఆ రెండు పార్టీల మధ్య మరింత సయోధ్య కుదిరేందుకు కారణం మాత్రం ఒకే ఒక్కరట. ఆయనే పీకే. ప్రశాంత్ కిషోర్. అదేంటి. ఆయనకు ఈ పార్టీల మధ్య సయోధ్యకు కారణమేంటి అనుకుంటున్నారా అక్కడకే వస్తున్నా.

ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే పేరును పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశాడు. కమలం పార్టీ జెండా రెపరెపలాడేందుకు తన వంతుగా పావులు కదిపాడు. అప్పటి విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తర్వాత కమలం గూటికి దూరం జరిగారు. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఇందులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. అక్కడ హస్తం పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు పీకే. అంతే కాదు…బీహార్లో జేడీయూ గెలిచేందుకు తన తెలివిని ఉపయోగించాడు. అందుకే ఆయనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో పావులు కదిపాడు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన శక్తిని ఉపయోగించాడు. ఇంకోవైపు ఢిల్లీలో ఆప్ విజయం కోసం తన మేధస్తుకు పదును పెట్టాడు. కేజ్రివాల్ పనితీరు బాగుండటమే కారణమైనా..ఆ అంశాన్ని జనాల్లో తీసుకెళ్లడం..ప్రభుత్వ పథకాలను ప్రకటించడం వరకు అంతా..పీకే వ్యూహమేనట. అందుకే ఇప్పుడు పీకేకు డిమాండ్ పెరిగింది. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో ఆయన విభేదాలొచ్చాయి. రెండు, మూడు సార్లు ఇదే విషయమై ఇటు నితీష్, అటు పీకే మధ్య వాగ్వాదాలు జరిగాయి. పార్టీ గీత దాటితే వేటు వేస్తామని హెచ్చరించారు బీహార్ సిఎం. చెప్పడమే కాదు చేసి చూపించారాయన. ఫలితంగా ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.. సిఎం నితీష్ వైరి వర్గంతో జత కట్టే ఆలోచన చేస్తున్నాడు. పనిలో పనిగా మోదీ వ్యతిరేక వర్గాన్ని ఏకం చేసే పనిలో పడ్డాడు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా ఎత్తులు వేస్తున్నాడనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపికైంది. రాజకీయ వర్గాలను కలవరపెడుతోంది.

ఏకతాటి పైకి వచ్చేనా…

ఇటు స్వామి కార్యం. అటు స్వకార్యంలా ఆయన చేతలు ఉంటున్నాయి. తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించే కసరత్తు చేస్తు్న్నాడు పీకే. అందే సమయంలో దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పని చేస్తున్నాడు. జేడీయూ, బీజేపీ మీద రగిలిపోతున్న పీకే వీలున్నంత తొందరగా వివిధ రాష్ట్రాలను పర్యటించేందుకు సిద్దమవుతున్నాడు.ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ కింకర్తవ్యం పై దృష్టి పెట్టింది. ఆ లోపే మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టే వ్యూహాన్ని ముమ్మరం చేశాడు పీకే. ముందుగా ప్రశాంత్ కిషోర్ తన మనసులో మాటను ఏపీ సిఎం జగన్మోహనరెడ్డికి చెప్పనున్నారు. తాము కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరేందుకు సిద్దమయ్యాడు. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ తనతో కలిసి వస్తుందని భావిస్తున్నాడు పీకే. ఇంకోవైపు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి సంబంధాలే ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ కు అంచి అనుబంధమే ఉంది. రాబోయే కాలంలో డిఎంకే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు పీకే. అవే కాదు… ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒక గాటన పట్టుకువచ్చేందుకు స్కెచ్ లు వేస్తున్నాడు ప్రశాంత్‌ కిశోర్‌. వాటి ద్వారా రానున్న ఎన్నికల్లో మోడీ అండ్ అమిత్ షాకి తన సత్తా చాటాలని ప్లాన్ గీస్తున్నాడు.

జగన్ వెళ్లకుండా…ప్లాన్

తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను పీకే తీసుకెళితే ఇబ్బంది అని అంచనా వేసింది బీజేపీ. అందుకే అటు వెళ్లకుండా తమవైపుకు తిప్పుకునే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఎన్నో రోజులుగా తమ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్న జగన్ ను హస్తినకు పిలిపించింది. దాదాపు 90 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ప్రాంతీయ, జాతీయ అంశాలే కాదు..తాజా రాజకీయ పరిణామాల పైనా వారిద్దరు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో బీజేపీ నేతల వైఖరి, చేస్తున్న కామెంట్ల పైనా చర్చకు వచ్చాయంటున్నారు. విషయం ఏదైనా రానున్న కాలంలో బీజేపీ, వైసీపీల మధ్య బంధం బలపడనుందనేది నిజం. అవసరమైతే ఎన్డీఏ కూటమిలో చేరి రెండు మంత్రి పదవులు తీసుకునేందుకు ఒప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి, అమలాపురం ఎంపీ చింతా అనురాధలకు మంత్రి పదవులు వరిస్తాయని ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ముందుగా నందిగాం సురేష్ పేరు తెరపైకి వచ్చినా..ఎందుకో ఆ తర్వాత చింతా అనురాధ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతలా వ్యవహారం ఉన్నా…ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందనేది నిజమంటున్నారు ఆ పార్టీ నేతలు. కానీ పైకి చెప్పేందుకు ఒప్పుకోవడం లేదు వాళ్లు. ఇంకోవైపు సిఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా..మాకు సమ్మతమేనంటున్నారు మంత్రి అనిల్ లాంటి నేతలు.

పరస్పర సహ…కారం

ప్రశాంత్ కిశోర్‌ ఫ్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ ను బీజేపీ అధిష్టానం కోరిందంటున్నారు. ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని చెప్పిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మరీ మాట్లాడిందని చెబుతున్నారు. మోదీతో భేటీ తర్వాత హోం శాఖ మంత్రి అమిత్ షాతో మరికొందరు కేంద్ర మంత్రులతోను మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించారు కీలక నేతలు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలడం లేదు. అదే సమయంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ను పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించనుందటం బీజేపీ. తనకు తాను పిలిచి మరీ ఏపీకి న్యాయం చేస్తామని చెబుతుంటే జగన్ మాత్రం ఎందుకు కాదంటారు. వాటికే ఒకే చెప్పారని సమాచారం. అంతే కాదు..ఏపీ శాసనమండలి రద్దు, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జరిగే మూడు రాజధానులకు కమలం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయింది. అదే సమయంలో బలమైన మిత్రపక్షం కోసం ఎదురు చూస్తోంది బీజేపీ. అందుకే కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. రెండు రోజుల పాటు ఆలోచించుకున్న తర్వాత మళ్లీ ఢిల్లీకి వెళ్లిన జగన్ అన్నీ మాట్లాడేసి వచ్చారంటున్నారు. తాను ఏం చేయనుందనే అంశాన్ని కీలక నేతలతో మాట్లాడాక చెబుతానని వచ్చారట. అంటే పీకే హాడావుడి పరోక్షంగా జగన్ కు కలిసొచ్చిందనే చర్చ సాగుతోంది.

ఏపీలో బీజేపీ ఇప్పటికే జనసేనతో దోస్తీ కడుతోంది. రెండు పార్టీలు కలిసి బెజవాడలో భారీ కవాతుకు ప్లాన్ చేశాయి. ఎందుకో అది కాస్త వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి కవాతు చేయలేదు. కానీ ఆ రెండు పార్టీల మధ్య రెండు సార్లు చర్చలు జరిగాయి. కలిసి ముందుకు వెళదామనే అభిప్రాయానికి వచ్చారు. కానీ ఆచరణలో ఇంకా ఆ పని జరగలేదు. ఇప్పుడు వైసీపీతో బీజేపీ దోస్తీ కడితే ఆ మేరకు జనసేన దూరం అయ్యే అవకాశముందంటున్నారు రాజకీయ నిపుణులు. కానీ ఈ విషయంలో పవన్ కల్యాణ్ చాలా తెలివిగా మాట్లాడాతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కలవవచ్చేమోగానీ.. పార్టీతో దోస్తీ చేయదంటున్నారు. ఇంకోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శి సునిల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ సైతం వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఫలితంగా ప్యాన్ పార్టీతో కమలం పార్టీకి దోస్తీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హస్తినలో దోస్తీ. ఏపీలో కుస్తీలా బీజేపీ, వైసీపీ వ్యవహారం మారిందంటున్నారు. రానున్న రోజుల్లో ఈ పొత్తుల పై క్లారిటీ వచ్చే వీలుంది.

-కొండవీటి శివనాగ్ రాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ9.

Related Tags