పోలింగ్ స్టేషన్ 69.. పోటీలో ఏడుగురు అభ్యర్థులు.. 54,655 మంది ఓటర్లు..ఓల్డ్ మలక్‌పేటలో నేడే రీ పోలింగ్

ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 54,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 ఉన్నారు. ఇక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో…

  • Sanjay Kasula
  • Publish Date - 11:50 pm, Wed, 2 December 20

పోలింగ్ స్టేషన్ 69.. ఇది గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్‌‌లో సంచలనంగా మారిన నెంబర్.. ఎందుకంటే ఈ సెంటర్‌లో గురువారం రీ పోలింగ్ జరుగనుంది. ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డివిజన్‌ మొత్తం ఎన్నికను నిలిపి వేశారు. ఈనెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు 69.. రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 54,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 ఉన్నారు. ఇక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో రద్దు అయిన రోజు ఓటు వేసినవారు కూడా మరోసారి ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ పోలింగ్‌లో పాల్గొన్న వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఇప్పటికే సిరా గుర్తు వేసినందున 3వ తేదీన జరిగే పోలింగ్‌ రోజున ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ నిర్ణయించింది.

ఆ రోజు బ్యాలెట్‌పై నాలుగో అభ్యర్థిగా సీపీఐ నుంచి ఫిర్దౌస్‌ ఫాతిమా బరిలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థులకు కంకి కొడవలి గుర్తును కేటాయించాలి. కానీ, ఇక్కడ సుత్తి కొడవలి, నక్షత్రం (CPM గుర్తు) గుర్తును కేటాయించారు. ఈ పొరపాటును ఒక పోలింగ్‌ కేంద్రం ద్వారం వద్ద అతికించిన బ్యాలెట్‌ జాబితాలో గుర్తించిన ఆ పార్టీ నేతలు వెంటనే విషయాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారధికి ఫిర్యాదు చేశారు.