అశ్విన్‌పై పెరుగుతోన్న విమర్శలు

Ravichandran Ashwin, అశ్విన్‌పై పెరుగుతోన్న విమర్శలు

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రేక్షకులతో పాటు క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఔట్ అయిన విధానం కొత్త వివాదానికి దారితీసింది. అశ్విన్ బంతి వేయబోయే సమాయానికి బట్లర్ క్రీజ్ వదిలి ముందుకు రాగా.. వెంటనే మన్కడింగ్ ద్వారా అశ్విన్ అతడిని ఔట్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గా ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది.

రూల్ 41.16 ప్రకారం థర్డ్ ఆంపైర్ చేసింది కూడా సరైనదే. కాని కెరీర్‌లో జెంటిల్‌మన్‌గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం ఆయనను విమర్శల పాలు చేసింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు చూసి కావాలనే అతడు అలా చేశారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ‘‘అశ్విన్ నువ్వు ఇలా చేస్తావని అసలు ఊహించలేదు. నీ తీరుతో సిగ్గుపడుతున్నాం’’ అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అశ్విన్ తనను సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘దీనిపై చర్చ అనవసరం. అదేం కావాలని చేసింది కాదు. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగ్రత్తగా ఉండటం అవసరం’’ అంటూ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *