కేరళకు రాహుల్.. వరద ప్రాంతాల సందర్శన

Rahul Gandhi to visit flood hit constituency camps in kerala today

భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న కేరళను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం సందర్శించనున్నారు. ఇప్పటికే ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలో వరదలకు సుమారు 60 మంది బలయ్యారు. కొండ చరియలు విరిగిపడడంతో రెండు రోజుల్లోనే 80 మందికి పైగా గాయపడ్డారు. రెండు లక్షలమందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1318 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. రాహుల్ నేడు నీలంబూర్, మాంపాడ్, ఎడవనప్పర, జిల్లాలను సందర్శించనున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ జిల్లాలో ఆయన నేడు గానీ, రేపుగానీ పర్యటించవచ్ఛు. కేరళలో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్న రాహుల్.. ఈ రాష్ట్రంలో యుధ్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని రాహుల్ ట్వీట్ చేశారు. అటు-కేరళ సీఎం
పినరయి విజయన్… ఆదివారం రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ టీమ్ లు నిరంతరం పని చేస్తున్నాయని, బాధితులకు సహాయ చర్యలు అందుతున్నాయని ఆయన ఆ తరువాత తెలిపారు. వర్షాల కారణంగా శుక్రవారం కొచ్చి విమానాశ్రయాన్ని మూసి వేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం మళ్ళీ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా వయనాడ్ జిల్లాలో ఓ కమర్షియల్ బిల్డింగ్ కూలిపోయింది. ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఈ జిల్లాతో బాటు మలప్పురం జిల్లాలో భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడడంతో 18 మంది మరణించారు. వచ్ఛే రెండు రోజుల్లో మలప్పురంతో బాటు వయనాడ్, కన్నూర్, కసర్ గఢ్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *