రాహుల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్

Rahul Gandhi Must Apologise.. : Digvijaya Singh's Brother.. A Congress MLA, రాహుల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. ఈ మాట అన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్‌గా నిల్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సోదరుడు, లక్ష్మణ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 10రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందున రాహుల్‌ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో.. తెలియజేయాలన్నారు. గతేడాది జూన్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంలో భాగంగా.. మందసర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అప్పుడ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పలు కీలక ప్రకటనలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక.. ఆ ప్రకటనలకు సంబంధించిన ముందడుగు మాత్రం వేయలేదు. తనతో సహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా రైతుల్ని కలుస్తున్నామనీ.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ధ్రువీకరణ పత్రాలు జారీచేసినా సంబంధిత బ్యాంకు మేనేజర్లు మాత్రం రుణం మాఫీ కాలేదని చెబుతున్నారంటూ వాపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని చచోడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్‌సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే లక్ష్మణ్ సింగ్ ఇలా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. మొన్న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్ధుతు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *