ఇదీ మన ఆకలి భారతం.. ఢిల్లీ వీధుల్లో పట్టెడన్నం కోసం జనం !

లాక్ డౌన్ కారణంగా వేలాది పేదల బతుకులు చితికిపోయాయి. పట్టెడన్నం కోసం బడుగు జీవుల వెతలు ఇన్నీ అన్ని కావు.. కరోనాను ఎదుర్కోవడంలో ఇండియా నుంచి అగ్రరాజ్యంతో సహా అనేక దేశాలు సాయం కోరుతూ ఈ దేశాన్ని ప్రశంసిస్తున్న వేళ..

ఇదీ మన ఆకలి భారతం.. ఢిల్లీ వీధుల్లో పట్టెడన్నం కోసం జనం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 5:23 PM

లాక్ డౌన్ కారణంగా వేలాది పేదల బతుకులు చితికిపోయాయి. పట్టెడన్నం కోసం బడుగు జీవుల వెతలు ఇన్నీ అన్ని కావు.. కరోనాను ఎదుర్కోవడంలో ఇండియా నుంచి అగ్రరాజ్యంతో సహా అనేక దేశాలు సాయం కోరుతూ ఈ దేశాన్ని ప్రశంసిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంకు సైతం ఇండియాను ‘భుజానికెత్తుకున్న వేళ..నాణేనికి మరో వైపులా పేదల ఆకలి కేకలు మాత్రం మిన్నంటుతున్నాయి. అన్నంపెట్టే చెయ్యి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం కనబడిన దృశ్యం కలచివేస్తోంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని బాబ్దీ పాఠశాల వద్ద ఉచిత భోజనం కోసం దాదాపు 500 మంది పేదలు సామాజిక దూరం పాటిస్తూ బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే పడిగాపులు పడుతున్నారు. మరికొద్ది సేపయ్యేసరికి ఈ సంఖ్య సుమారు 1200 కి చేరింది. మండుటెండలో నిలబడలేక.. రోడ్డుపై తమ సంచీయో, ఖాళీ కంచమో .. ఏదో ఒకటి లైన్లో పెట్టి..పేవ్ మెంటు పై నీడలో నిలుచున్నారు చాలామంది.  లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం స్తంభించిపోవడంతో  తనకు ఎలాంటి ఉపాధి లేకపోయిందని, ఇక విధిలేక ఇలా యాచకుడిలా ఉచిత భోజనం కోసం ఉదయం ఆరు గంటల నుంచే క్యూలో నిలబడ్డానని ఓ ఆటో డ్రైవర్ తెలిపాడు. అయితే అందరికీ ఆహారం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కాస్త అన్నం,  పప్పు, ఓ కూర అంతే ! దీనికే వందలమంది మిణుకుమిణుకుమంటున్న ఆశలతో… కళ్లలో వత్తులు వేసుకుని గంటలతరబడి నిలబడినా చివరన వఛ్చిన వారు ఖాళీ కడుపులతో వెనక్కి మళ్లాల్సిందే! ఈ మహానగరంలో పేదలకు ఇలా ఉచిత భోజనం పెట్టే కేంద్రాలు సుమారు రెండున్నర వేలు ఉన్నా.. ఇంతటి దయనీయ పరిస్థితి మాత్రం ఎన్నడూ కనబడలేదని అంటున్నారు.