నగరంలో మద్యం పంపిణీపై ఈసీ నజర్.. గ్రేటర్ శివారులో చెక్‌పోస్టులు.. అమ్మకాలపై అంక్షలు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది.

  • Balaraju Goud
  • Publish Date - 3:48 pm, Fri, 27 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. ముఖ్యంగా బల్క్‌ మద్యం విక్రయాలు, కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ప్రచారం, పోలింగ్‌ సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ జరగకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరితోపాటు పొరుగు జిల్లాలకు చెందిన ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీని అరికట్టేందుకు అధిక మొత్తంలో మద్యం విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించినట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి ఒకటి లేదా రెండు కార్టన్ల కంటే ఎక్కువ మద్యం విక్రయిస్తే వైన్స్‌ నిర్వాహకులతోపాటు కొనుగోలుదారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు లేని ఇతర ప్రాంతాల నుంచి మద్యం సరఫరా చేయకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో రవాణాశాఖ, ఆబ్కారీ అధికారులు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీరికితోడు మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలను రంగంలోకి దించారు. నగరవ్యాప్తంగా అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలాగే, ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్‌ పరిధిలో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం విధిస్తూ డ్రై డే అమలు ఉంటుందని ఈసీ పేర్కొంది. ఆ రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్‌లోకి మద్యం సరఫరా జరగకుండా పోలీసులతో కలిసి పటిష్ట చర్యలు తీసుకోవాలిన అధికారులను ఆదేశించింది. అలాగే ఎన్నికల కౌంటింగ్ రోజైన డిసెంబరు 4న కూడా డ్రైడే అమల్లో ఉంటుందని చెప్పారు. మద్యం దుకాణాల్లో జరిగే క్రయ, విక్రయాలను పరిశీలించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు.