పారిపోయి తప్పు చేసిన రాహుల్..! కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

రాహుల్ గాంధీ తీరుపై సొంత పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడమే పార్టీకి అతిపెద్ద ఓటమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయంపై కనీసం సమీక్షా సమావేశం జరపలేదని విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోలేదని.. ఈ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అసలు ఎందుకు ఇంత ఘోరంగా ఓటమిని చవిచూశామో కూర్చొని మాట్లాడకోకుండా, తమ అధినేత పారిపోవడమే అతిపెద్ద ఓటమని పేర్కొన్నారు. అంతేగాక ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారన్నారు. కానీ, ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నుంచి వచ్చిన విజ్ఞప్తులను అన్నింటినీ విస్మరించారన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత.. సొంత పార్టీ నేతలు ఇంతలా ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.

అంతేకాదు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత పార్టీలో శూన్యత ఆవరించిందన్నారు. తిరిగి అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ స్వీకరించడం తాత్కాలికమేనని భావిస్తున్నామన్నారు. సోనియా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్య మరింతగా పెరిగిదన్నారు. రాహుల్ రాజీనామా చేయాలని తాను కోరుకోలేదని, అతను పదవిలోనే ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా రాహుల్ నేతృత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు.

కాగా, ఇటీవల ఆయన పార్టీ వీడుతున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పరిస్థితి ఒకేలా ఉందని, తాను పార్టీ వీడుతానని చేస్తున్న ప్రచారంలో నిజంలేదని కొట్టిపారేశారు. ఏం జరిగినా తాను కాంగ్రెస్‌ పార్టీని వీడబోనని, పార్టీ నుంచి అన్ని రకాలుగా లబ్ది పొంది కష్టకాలంలో బయటకు వెళ్లిపోయినవారిలా తాను కాదని ఖుర్షీద్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *