Private travels bus fares: సందిట్లో సడేమియాల జోరు.. పండుగ పేరు పబ్బం గడుపుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

సంక్రాంతి పండుగను సాకుగా చూపి.. ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు. కరోనా కాలంలోనూ టికెట్ రేట్లపై.. రెండు, మూడింతలు వసూలు చేస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:53 am, Wed, 13 January 21

ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దండుకుంటున్నారు. సంక్రాంతి పండుగను సాకుగా చూపి..ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు. కరోనా కాలంలోనూ టికెట్ రేట్లపై.. రెండు, మూడింతలు వసూలు చేస్తున్నారు. ఇక ఏసీ, స్లీపర్ టికెట్ రేట్లు మరింత పెంచేశారు. కరోనా మహమ్మారి దెబ్బకు రైల్వే సరిపడా రైళ్లు నడపడం లేదు. దీనితో ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తామనుకునే వారికి అప్పుడే ప్రవేట్ ఆపరేటర్స్ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేక ఛార్జీల పేరుతో ప్రైవేటు వాహనాల్లో అదనపు మొత్తం దండుకుంటున్నాయి. పేర్లు వేరైనా దోపిడిమాత్రం కామన్. ప్రతి ఏడాది ఇది షరామాములే అయినప్పటికీ.. మరోసారి సంక్రాంతి పండుగ పేరుతో ప్రైవేట్ ఆపరేటర్స్ దోపిడీకి తెగబడుతున్నారు.

కరోనా కారణంగా తో రైళ్లలో అన్నీ రిజర్వేషన్‌ బోగీలే.. కోవిడ్ నిబంధనల్లో భాగంగా రిజర్వేషన్‌ ఖరారైన వారిని మాత్రమే రైల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు, ఆర్టీసీ పండుగ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు ఫెస్టివల్ పేరుతో ప్రయాణి కుల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

సంక్రాంతి తె‌లుగు వారి ముఖ్యమైన పండుగ ఉద్యోగం చేసేందుకు నగరాలకు,పట్టణాలకు వెళ్లినవారు కచ్చితంగా ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు పయనమవుతారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో ఉండే వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో పయనం అవుతుంటారు. ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఈ ట్రావెల్స్ ద్వారా జరుగు తుంది.. ఓ వైపు కరోనా.. మరోవైపు చాలా రోజుల తర్వాత పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సొంతూళ్లకు తిరిగి వెళ్లే అవకాశం ఉండకపోవడం.. ఊళ్లలో ఉన్న వాళ్లు తిరిగి వచ్చే అవకాశం ఉండడంతో ఈ సంక్రాంతికి రాకపోకలు ఎక్కువగా సాగుతాయని అంచనా.

అంతే కాకుండా కరోనాతో రైల్వే శాఖ గతంతో పోల్చుకుంటే కేవలం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైల్వే స్టేషన్స్ లో రద్దీ పూర్తిగా లేకుండా రిజర్వేషన్ టికెట్ ఉంటేనే స్టేషన్‌లోకి అనుమతి ఇస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సంక్రాంతికి స్పెషల్ రైళ్లు నడుపుతామని చెబుతోంది. కానీ, రిజర్వేషన్స్ ఉంటేనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెబుతోంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కూడా బస్సులు పరిమితస్థాయిలో నడుపుతోంది. సంక్రాంతికి వెళ్ళే వారి రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రైల్వే లో గతంలో లాగా లేదు. దీంతో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ఆపరేటర్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారితో ఏపీఎస్‌, టీఎస్​ ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ బుక్‌ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాలకు నిత్యం నడిపే సర్వీసులు నిండిపోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్‌ ఉంది. సర్వీసులన్నీ దాదాపు నిండిపోయాయి. ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. పండుగకు మొత్తంగా 3,607 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా, వీటిలో హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలకు 1,251 సర్వీసులు ఉన్నాయి.

ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇలా ఉంటే..పండుగ సమయంలో అధిక చార్జీల తో దోచుకునే ప్రైవేటు ఆపరేటర్స్..ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఈఏడాది ప్రయాణానికుల అవసరాన్ని అసరగా చేసుకుని రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం నిత్యం తిరిగే సర్వీసుల్లోనే ఛార్జీలనూ ఒక్కసారిగా పెంచేశారు. పండక్కి ఇంకా నాలుగు రోజుల సమయంఉండటం..సంక్రాంతి జనవరి 14న ఉండటంతో 9 నుంచి 13వరకుప్రయాణాలకు డిమాండ్‌ ఉంటుంది.

మరోవైపు, ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీల వసూళ్లపై ధ్యాస పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం.. కోవిడ్ నిబంధనలకు నీళ్లు వదిలారు. ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సులలో ఎక్కడా.. భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదు. మాస్కు తప్పనిసరి చేసినా..కొన్ని నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ఇక, అడపాదడపా ఆర్టీఏ అధికారులు దాడి నిర్వహిస్తున్న ట్రావెల్స్ బస్సులు యధేచ్చగా తిరిగేస్తున్నాయి.

Read Also… తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత