హైదరాబాద్ రానున్న మోదీ.. నవంబర్ 28న పర్యటన.. సడన్‌గా ఖరారైన టూర్.. కేవలం గంటసేపే..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భాగ్యనగరానికి రానున్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడుతోంది. మోదీ పర్యటనలో ఒక్క మాట మాట్లాడినా అది గ్రేటర్ ఎన్నికల ప్రచారానికేనని అభిప్రాయం కలిగే సంకేతాలున్నాయి.

  • Rajesh Sharma
  • Publish Date - 5:36 pm, Thu, 26 November 20

Prime MInister Modi to visit Hyderabad: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28న హైదరాబాద్ నగరానికి రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల చివరి రోజున ప్రధాన మంత్రి హైదరాబాద్ రానుండడంతో సర్వ్రతా ఆసక్తి నెలకొంది. అయితే.. ప్రచారం ముగియడానికి కేవలం 50 నిమిషాల ముందు హైదరాబాద్ చేరుకోనున్న నరేంద్ర మోదీ.. ప్రచార పర్వం ముగిసిన పది నిమిషాలకే తిరుగు ప్రయాణం కానున్నారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల మంటలు రగులుకున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకుల రాకను గులాబీ నేతలు తప్పుపడుతున్నారు. అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా జీహెచ్ఎంసీ ప్రచారానికి స్థానిక నేతలు పిలుచుకు వస్తారంటూ తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు హఠాత్తుగా పర్యటన ఖరారైంది. దాంతో స్థానికంగా మోదీ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది.

అయితే, మోదీ పర్యటనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. నవంబర్ 29న సాయంత్రం 4.10 గం.లకు హైదరాబాద్ శివారులోని హకీంపేట విమానాశ్రయానికి రానున్న ప్రధాని.. అక్కడ్నించి 18 కిలోమీటర్ల దూరంలో వున్న భారత్ బయోటెక్ పరిశోధనా, తయారీ సంస్థకు చేరుకుంటారు. కరోనా వ్యాక్సిన్ రూపకల్పనకు సంబంధించిన పనితీరును పరిశీలించి, శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత సా. 5.10 గంటలకు నేరుగా హకీంపేటకు వెళ్ళి న్యూ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. అయితే యాదృచ్ఛికంగా అదే రోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో మోదీ పర్యటనపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో హకీంపేట నుంచి భారత్ బయోటెక్ వరకు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో దాని పంపిణీపై కసరత్తు చేస్తున్న ప్రధాన మంత్రి మోదీ.. నవంబర్ 24న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాణ్యమైన, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్‌ను ఎంపిక చేసే బాధ్యత కేంద్రంపై మోపారు కొందరు ముఖ్యమంత్రులు. అదే సమయంలో బెటర్ వ్యాక్సిన్ వేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్‌తో రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం వుండడంతో మోదీ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్ వచ్చే ముందు రోజున అంటే నవంబర్ 28వ తేదీన ప్రధాని పుణె నగరానికి వెళ్ళనున్నారు. అక్కడి సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందుతున్న వ్యాక్సిన్‌పై కూడా ప్రధాని సమీక్ష జరపనున్నారు. వ్యాక్సిన్‌ మంచి చెడ్డలను వాకబు చేసేందుకు తలపెట్టిన పర్యటనల్లో భాగంగానే ప్రధాని మోదీ.. మొదట పుణెకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.