బెంగాల్ రాజకీయాల్లో పీకే… టార్గెట్ 2021

పశ్చిమబెంగాల్‌లొ మమతా బెనర్జీకీ బీజేపీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆపార్టీలోకి తృణమూల్ ఎమ్మెల్యేలు జంప్ అవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో దీదీ నేతృత్వంలోని టీఎంసీ ప్రతిష్ట మసకబారే పరిస్థితికి వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని టీఎంసీని ఇరకాటంలోకి నెట్టింది. ఈ పరిస్థితిలో తృణమూల్ కాంగ్రెస్.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని నిర్ణయించింది . ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్‌తో దీదీ మూడుసార్లు సమావేశమై పార్టీ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. తిరిగి పార్టీ పుంజుకోడానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ పలుమార్లు సమీక్షించారు.

మరోవైపు 1993, జులై 21న లెఫ్ట్ హయాంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు మరణించిన నేపథ్యంలో టీఎంసీ ప్రతి సంవత్సరం ర్యాలీని నిర్వహిస్తోంది. దీదీ ఆసమయంలో యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు. అదే పంథాలో ఆదివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్‌ మెగా మార్టిర్స్‌ డే ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో పీకే కూడా హాజరు కానున్నారు. రాజకీయ చదరంగంలో వేయాల్సిన ఎత్తులు బాగాతెలిసిన ప్రశాంత్ కిషోర్.. ఈ ర్యాలీ సందర్భంగా బెంగాల్ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో అర్ధంచేసుకోనున్నారు.

ఇదిలా ఉంటే 2021లో జరగనున్న బెంగాల్ ఎన్నికలకు ఇప్పటినుంచి పీకే తన మార్క్ వ్యూహాలను సిద్ధం చేసి దీదీకి ఇవ్వనున్నట్టుగా టీఎంసీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా పీకే అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. చాపకింద నీరులా బెంగాల్‌లో విస్తరిస్తున్న బీజేపీని బెంగాల్ దరిదాపుల్లో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది తృణమూల్ కాంగ్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *