Postman Built Pebble Palace: గులకరాళ్ళతో అద్భుత కోట.. ఓ పోస్ట్ మాన్ క్రియేటివిటీకి అందరూ ఫిదా..!

దారిలో కనిపించిన గులక రాళ్లను చూసి విభిన్నంగా అలోచించి అద్భుతమైన కోటను నిర్మించి చరిత్రలో నిలిచిన ఓ పోస్ట్ మాన్... ఎప్పుడో.. ఎక్కడో తెలుసా..!

Postman Built Pebble Palace: గులకరాళ్ళతో అద్భుత కోట.. ఓ పోస్ట్ మాన్ క్రియేటివిటీకి అందరూ ఫిదా..!
Follow us

|

Updated on: Jan 05, 2021 | 4:36 PM

ఎవరైనా రోడ్డు మీదనో సముద్రం ఒడ్డునో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఏవైనా గులక రాళ్లు కనిపిస్తే ఏం చేస్తాం.. తన్నుకుంటూనో వెళ్తాము లేదా ఆ గులక రాళ్ల మరీ అందంగా కనిపిస్తే.. వాటిని తీసుకుని ఇంటికి తెస్తాం. అయితే ప్రాన్స్ కు చెందిన ఓ పోస్ట్ మాన్ మాత్రం దారిలో కనిపించిన గులక రాళ్లను చూసి విభిన్నంగా ఆలోచించాడు.. అందుకే వందల ఏళ్ళైనా చరిత్రలో సాధారణ పోస్ట్ మాన్ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయాడు. మరి ఎవరా వ్యక్తి.. అతను గులకరాళ్ళతో సృష్టించిన అద్భుతం ఏమిటో తెలుసుకుందాం. ప్రాన్స్ కు చెందిన ఫెర్డినాండ్ షెవల్ అనే వ్యక్తి 1837 సంవత్సరంలో పోస్టు మాన్ గా ఉద్యోగం చేసేవారు. అప్పట్లో షెవల్ కి తన వద్దకు వచ్చే ఉత్తరాలను బట్వాడా చేయడానికి కనీసం సైకిల్ కూడా లేదు. దీంతో దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వెళ్లి లేఖలను అందజేసేవారు.. ఈ నేపథ్యంలో ఆయనకు దారిలో ఓ మంచి గులక రాయి కనిపించింది. అది ఆయన కట్టిన ఓ పెద్ద కోటకు పునాది రాయి అయింది!

ఫెర్డినాండ్ షెవల్ ఫ్రాన్స్ లోని హాటెరివెస్ నగరంలో ఓ కోట కట్టారు. ఎవరికైనా చెబితే ఎద్దేవా చేస్తారేమోనన్న భయంతో ఎవరికీ ఆ విషయమే చెప్పలేదు. ప్రకృతి సహకరించడంతో తానే మేస్త్రీగా .. ఆర్కిటెక్టుగా మారి కోట కట్టడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఈ నగరం అంతా సముద్రం సమీపంలో ఉండేది.. దీంతో షెవల్ నడిచే దారిలో రకరకాల గులకరాళ్లు, సున్నపురాయి లాభమయ్యేవి. అయితే ఫ్రాన్స్ దేశంలో అప్పటికే విభిన్న శైలిలో నిర్మితమైన కోటలకు ప్రసిద్ధి. దీంతో ఆయన వాటన్నింటికి భిన్నంగా తానే ఓ మంచి కోటను కట్టాలని భావించారు. అయితే ఆయనకు ఇళ్లను ఎలా నిర్మించాలనే అవగాహన లేదు.. కానీ ఆలోచన మాత్రం విరమించుకోలేదు..  ప్రతి రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేటప్పుడు రంగురంగుల రాళ్లు సేకరించడం మానలేదు.. రహదారిలో కనిపించే రంగురంగుల రాళ్లను సేకరించి.. జేబుల నిండా నింపుకుని వచ్చేవారు. అలా పోగుచేసిన ఒక్కోరాయిని తన ఆలోచనకు అనుగుణంగా పేర్చుకుంటూ.. ఏకంగా 33 ఏళ్ల పాటు శ్రమించారు ఫెర్డినాండ్ షెవల్. 24 మీటర్ల ఎత్తైన కోటను కట్టేశారు. ఆ కోటను చూడటానికి రెండు కళ్లూ చాలవు. మొత్తం 9 వేల రోజుల పాటు 65 వేల గంటలు కష్టపడి ఈ కోటను నిర్మించారు.

అనంతరం తాను రాళ్లతో కోటను కట్టడానికి పడిన శ్రమను వివరిస్తూ.. 1922 నుంచి కోట కట్టిన విధానాన్ని జీవిత చరిత్రగా రాయడం మొదలుపెట్టారు. సరిగ్గా అది పూర్తయిన రెండు రోజుల తర్వాత.. 1924 ఆగస్టు నెలలో తన 88వ ఏట మరణించారు. తన కోట గోడల మీద ఆక్టోపస్, ఏనుగులు, పెలికాన్ పక్షులు, ఎలుగుబంట్లు, రకరకాల పక్షుల బొమ్మలన్నింటినీ చిత్రించారు. ఈ కోటను ‘ద ఐడియల్ ప్యాలెస్’ అని అంటారు. అదిప్పుడు ఓ మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఫ్రాన్స్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ దాన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించింది. 1984లో చావెల్ మనవరాలు అక్కడకు ప్రజలు వచ్చి చూడటానికి వీలయ్యేలా ఆ కోటను ఇచ్చేసింది.

Also Read: రైతులు నిరసన చేస్తుంటే మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారు, మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్