పోర్టు ఇక్కడ.. అనుబంధ పరిశ్రమలు అక్కడ.. ఇదేం విచిత్రం? రామాయపట్నం పురోగతిపై ప్రకాశం జిల్లాలో తీవ్ర ఆగ్రహం

ప్రకాశంజిల్లా ప్రజల దశాబ్దాల కల రామాయపట్నం పోర్టు సాకారమయ్యే వేళ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. పోర్టు మాత్రమే ప్రకాశం జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా...

పోర్టు ఇక్కడ.. అనుబంధ పరిశ్రమలు అక్కడ.. ఇదేం విచిత్రం? రామాయపట్నం పురోగతిపై ప్రకాశం జిల్లాలో తీవ్ర ఆగ్రహం
Follow us

|

Updated on: Nov 21, 2020 | 7:15 PM

Port here and industries there: Prakasham people anger: ప్రకాశంజిల్లా ప్రజల దశాబ్దాల కల రామాయపట్నం పోర్టు సాకారమయ్యే వేళ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. పోర్టు మాత్రమే ప్రకాశం జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా నెల్లూరు జిల్లా పరిధిలో జరిగేలా చకచకా అడుగులు పడుతున్నాయి. గుడ్లూరు మండల పరిధిలోని సాలిపేట, రావూరు, చేవూరు పంచాయతీల పరిధిలో మాత్రమే పోర్టు కోసం భూములు సేకరించాలని ఉన్నతస్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు అందడం… మిగిలిన భూములన్నింటినీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమవడంతో ప్రకాశంజిల్లా వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రకాశంజిల్లా రామాయపట్నం దగ్గర పోర్టు పేరుకే కానీ, అందుకు అనుగుణంగా రామాయపట్నంలో ఒక్క ఎకరం కూడా సేకరించటం లేదు. పోర్టు అనుబంధ పరిశ్రమలు, అభివృద్ది కోసం పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలోని భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నించడంతో దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజలు కదలకపోతే తీవ్ర అన్యాయం జరగడం ఖాయం అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఈ నేపధ్యంలో కందుకూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అధికారులపై ధ్వజమెత్తారు… పోర్టు ఒక్కటే రామాయపట్నంలో పెట్టి, అనుబంధ పరిశ్రమలు, అభివృద్ది అంతా నెల్లూరు జిల్లా పరిధిలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రామాయపట్నం పోర్టు వ్యవహారం ప్రకాశం, నెల్లూరుజిల్లాల మధ్య హీట్‌ పెంచింది.

రామాయపట్నం పోర్టు ఏర్పాటుపై అధ్యయనం కోసం నియమించిన రైట్స్‌ అనే కేంద్రప్రభుత్వ రంగ సంస్థ భారీ ఓడరేవు నిర్మాణానికి రామాయపట్నం పరిసరాలు అన్నివిధాలా అనుకూలమని ఈ ప్రాంతంలో పోర్టు కోసం 3500 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం మరో 10 వేల ఎకరాలు సేకరించాలని నివేదించింది. అందుకనుగుణంగా డీపీఆర్‌ని సిద్ధం చేసింది. కేవలం పోర్టుకే గాక ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపరు పరిశ్రమకు కూడా అప్పట్లో శంకుస్థాపన జరిగింది. ఏపీపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఎంఓయూ కూడా చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఏపీపీ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన విరమించుకోగా ప్రస్తుతం అసలు పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశమే లేని దుస్థితి నెలకొనటం బాధాకరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పోర్టు కోసం గ్రామాలు ఖాళీచేసేది ప్రకాశంజిల్లా గ్రామస్థులైతే ఉపాధి అవకాశాలన్నీ నెల్లూరు జిల్లావాసులకా అన్న ఆక్రోశం వ్యక్తమవుతోంది. సాలిపేట, రావూరు, చేవూరులతో పాటు ఉలవపాడు మండలంలోని రామాయపట్నం, చాకిచర్ల, కరేడు వరకైనా పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించటంతో పాటు గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని అటవీభూములను కూడా వినియోగించటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపధ్యంలోనే కందుకూరులో రామాయపట్నం పోర్టు ఏర్పాటు విషయంలో జరిగిన సమీక్షా సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అధికారులపై ధ్వజమెత్తారు. పోర్టు ప్రకాశంజిల్లాలో అభివృద్ది నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. అక్కడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు… ఇక్కడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు… నెల్లూరుకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రశ్నించారు.

కందుకూరులో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా భూసేకరణ గణాంకాలపై లోతుగా విశ్లేషించిన కలెక్టరు సైతం ‘‘ ఇదేంటి మనం గమనించలేదు ఇక పరిశ్రమల కోసం మన జిల్లాలో ఏమీ మిగలడం లేదే ’’ అంటూ విస్మయం వ్యక్తం చేయటం పరిస్థితికి అద్దం పడుతోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో జిల్లాకు అన్యాయం జరుగుతుందని విన్నామే కానీ ఇంత అన్యాయం జరుగుతుందన్న విషయం గుర్తించలేకపోయామని, అభివృద్ధి విషయంలో జిల్లాకు జరగబోతున్న అన్యాయం విషయంలో స్పష్టత వచ్చినందున తనవంతుగా ప్రభుత్వానికి నివేదిస్తానని కూడా కలెక్టరు పోలా భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని సీయం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళతామంటున్నారు.

మరోపక్క పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాత్రం పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ద్వారా 6,500 ఎకరాలు సేకరించేందుకు ఆ జిల్లాయంత్రాంగం యుద్ధప్రాతిపదికన పరుగులు తీస్తోంది. పోర్టు ఇక్కడ… పరిశ్రమలు అక్కడా… అన్న అంశంపై ప్రకాశం జిల్లాలో ఆందోళన వస్తుందన్న అంశం చర్చకు వచ్చిన సందర్భంలో అంత ఇబ్బంది అయితే పోర్టుని కూడా నెల్లూరు జిల్లా పరిధిలోకి మార్చుకుందామని అక్కడ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

పోర్ట్‌ ఏర్పాటుకి భూసేకరణ ప్రక్రియతో సంబంధం లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రభుత్వం నుంచి వత్తిడి ఉందని అందువల్ల వచ్చే నెల 6,7 తేదీల్లోనే టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రకాశంజిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశంజిల్లాలోనే పోర్టు, అనుబంధ పరిశ్రమలు, వాటి అభివృద్ది నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ALSO READ: తమ్మినేనికి తప్పిన ముప్పు.. రోడ్ యాక్సిడెంట్‌లో తృటిలో ఎస్కేప్

ALSO READ: పార్టీ మారితే చెప్పే పోతానంటున్న మాజీ మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్