హాంకాంగ్ అల్లర్లు అగ్రరాజ్యం పనే.. కస్సుమంటున్న డ్రాగన్

Pompeo jabs at China’s ‘bad behavior’.. defends US tariffs, హాంకాంగ్ అల్లర్లు అగ్రరాజ్యం పనే.. కస్సుమంటున్న డ్రాగన్

హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని చైనా ఆగ్రహించింది. చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు హాంకాంగ్‌లో అల్లర్లకు అమెరికా ఆజ్యం పోస్తోందని డ్రాగన్ ఆరోపిస్తోంది. చైనాకు నేరస్తుల అప్పగింత బిల్లును నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్‌ సీఈవో ప్రకటించినా.. ప్రజలు వెనక్కి తగ్గడంలేదు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్‌తో నిరసనలు కొనసాగిస్తున్నారు. టియర్ గ్యాస్, రబ్బరు తూటాలు, అరెస్టులకు భయపడటం లేదు.

కాగా హాంకాంగ్‌లో కొనసాగుతున్న నిరసనల విషయంలో చైనా సరైన నిర్ణయం తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై చైనా మండిపడింది. ఆయన అమెరికా విదేశాంగ మంత్రిలా కాకుండా సీఐఏ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువాచుయింగ్ ఆరోపించారు.

హాంకాంగ్‌లో జరుగుతున్న చైనా వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా పతాకాలు ప్రముఖంగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ నిరసనల వెనుక అమెరికా స్పష్టమైపోయిందని చైనా ఆరోపించింది. హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నాయని హువాచుయింగ్ ధ్వజమెత్తారు.

ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో చైనా ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *