కర్నూలులో కాక రేపుతున్న విజయ డైరీ ఎన్నికలు.. చైర్మన్‌ పదవి కోసం ఢీ అంటే ఢీ అంటున్న భూమా, ఎస్వీ కుటుంబాలు

కర్నూలు జిల్లాలో విజయ మిల్క్ డైరీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా మారింది. మాజీ మంత్రి, టిడిపి నేత భూమా

  • K Sammaiah
  • Publish Date - 12:46 pm, Wed, 27 January 21
కర్నూలులో కాక రేపుతున్న విజయ డైరీ ఎన్నికలు.. చైర్మన్‌ పదవి కోసం ఢీ అంటే ఢీ అంటున్న భూమా, ఎస్వీ కుటుంబాలు

కర్నూలు జిల్లాలో విజయ మిల్క్ డైరీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా మారింది. మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 25 ఏళ్లుగా భూమా కుటుంబానికే ఏకగ్రీవంగా చైర్మన్ పదవి దక్కుతోంది. అయితే ఈసారి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఎమ్మెల్యేలకు అల్టిమేటం జారీ చేశారు సీఎం జగన్. దీంతో 25 ఏళ్ల తర్వాత ఎన్నికలు అనివార్యమయ్యాయి.

భూమా నాగిరెడ్డి చిన్నాన్న నారాయణ రెడ్డి 25 ఏళ్లుగా చైర్మన్‌గా ఉంటూ వస్తున్నారు. పోటీ అనివార్యం కావడంతో చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున అఖిలప్రియ మేనమామ ఎస్.వి.జగన్ మోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే అయినప్పటికీ పార్టీలు వేరువేరు కావడంతో ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

విజయ డైరీలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని వైసీపీ అభ్యర్థి SV జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నారాయణ రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న మొదట్లో.. అంతా బాగున్నా.. ఇప్పుడు అవినీతికి పాల్లపడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే నిన్నటి వరకు పంతాలు, పట్టింపులుగా ఉన్న పాలిటిక్స్‌ ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది.

భూమా కుటుంబంలో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా నారాయణరెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలేశ్వరరెడ్డిలపై కిడ్నాప్‌ కేసు పెట్టారు. 365, 384, 344, 506 సెక్షన్లను అందులో పొందుపరిచారు. తనను కిడ్నాప్‌ చేసి బలవంతంగా నామినేషన్‌ వేయించారని డైరెక్టర్‌గా పోటీచేస్తున్న మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఈ ఎన్నికల్లో గెలుపు మాజీ మంత్రి అఖిల ప్రియకు సవాల్‌గా మారింది. పాతికేళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న.. విజయ డెయిరీ చైర్మన్‌ పదవిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇన్నాళ్లు ఏకగ్రీవంగానే దక్కతూ వస్తున్న పదవి.. ఇప్పుడు గెలిచి సాధించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకాలం భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డికి తిరుగు లేకుండా ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. అఖిలప్రియ మేనమామ, శోభా నాగిరెడ్డి తమ్ముడు SVS జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

ఏటా రూ.140 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డెయిరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అటు భూమా, ఇటు SV కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల రాజకీయం ఆసక్తిగా మారింది.