బీహార్‌లో పెరిగిన ఎన్నికల వేడి

బీహార్‌ ఎన్నికల నగరా మోగింది.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పెద్ద ఎన్నికలు ఇవే కాబట్టి సహజంగానే వీటిపై దేశమంతటా అసక్తి పెరిగింది.. నవంబర్‌లో ఎన్నికలు ఖాయంగా జరుగుతాయని తెలుసు కాబట్టే..

బీహార్‌లో పెరిగిన ఎన్నికల వేడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 26, 2020 | 12:42 PM

బీహార్‌ ఎన్నికల నగరా మోగింది.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పెద్ద ఎన్నికలు ఇవే కాబట్టి సహజంగానే వీటిపై దేశమంతటా అసక్తి పెరిగింది.. నవంబర్‌లో ఎన్నికలు ఖాయంగా జరుగుతాయని తెలుసు కాబట్టే రెండు నెలల ముందు నుంచే బీహార్‌లో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఎన్నికల సమరాంగణంలో దూకేందుకు రాజకీయపార్టీలు సమాయత్తం అయ్యాయి కూడా! ఇక తేలాల్సింది పొత్తులే! ఆపై సీట్ల పంపకాలు.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో కాంగ్రెస్‌పార్టీ పొత్తు ఖరారయ్యింది.. ఆర్‌జేడీ తమ నాయకుడిగా తేజస్వీయాదవ్‌ను ప్రొజెక్ట్‌ చేస్తుండటంపై కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవు.. కాకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే నిర్ణయించకూడదని అంటోంది. మహాగడ్బంధన్‌ తరఫున ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికలకు ముందు నిర్ణయించాలన్నది కాంగ్రెస్‌ వాదన! ఈ విషయంలో ఉభయ పార్టీలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందంటున్నారు బీహార్‌ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జ్ శక్తిసిన్హ్‌ గోహిల్‌. తమ లీడర్లను ప్రొజెక్ట్ చేసుకోవడమన్నది పార్టీల హక్కని, ఇందులో కాంగ్రెస్‌కు ఇలాంటి అభ్యంతరాలు లేవని, కాకపోతే కూటమికి సారథ్యం వహించేది ఎవరన్నది మాత్రం ఇప్పుడే నిర్ణయించుకోవడం ఉభయ శ్రేయస్కరమని గోహిల్‌ అంటున్నాడు. రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తేజస్వీయాదవ్‌ను కూటమి నాయకుడిగా ప్రకటిస్తే మాత్రం తాము మహాగడ్బంధన్‌ నుంచి వైదొలుగుతామని చెప్పుకొచ్చారు.. ఆర్‌జేడీ నేతృత్వంలోని కూటమిలో ఉండేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తేజస్వీ యాదవ్‌ను కూటమి నాయకుడంటే మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూసుకుంటామని కాంగ్రెస్‌ నేత గోహిల్‌ తెలిపారు. బీహార్‌లో గెలుపోటములు కచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని, అందుకే విజయం సాధించాలనే పట్టుదల ప్రతీపార్టీకి ఉంటుందని చెబుతున్నారు గోహిల్‌.. అందుకే వీలైనన్ని ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయాలని అనుకుంటాయన్నారు. అయితే బీజేపీ-జేడీయూ కూటమిని ఓడించాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం కొన్ని త్యాగాలు చేయకతప్పదని చెప్పారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బీహార్‌లోకి వచ్చేసరికి అక్కడి ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోక తప్పడం లేదు.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చాలా కాలమే అయ్యింది. బీజేపీనేమో జేడీయూ పంచన చేరితే, ఆర్జేడీకి కాంగ్రెస్‌ స్నేహహస్తం అందిస్తోంది.. అయితే ఆర్డేడీని ముందుంచి నడిపించే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలులో ఉండటం ఆ పార్టీకి పెద్ద మైనస్‌.. పార్టీ పగ్గాలను చేపట్టిన లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ సమర్థత మీద పార్టీ నేతలకే అనుమానాలున్నాయి.. సోదరుడు తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌తో గొడవలు కూడా పార్టీపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకతున్నారు.. అలాగని ప్రభుత్వంపై ప్రజలు సానుకూల ధోరణితో ఉన్నారని చెప్పలేని పరిస్థితి.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఏమంత గొప్పగా లేదు.. కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని బాగా దెబ్బ తీసింది.. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే ఊడిపోయాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది.. యువతలో నిరాశ ఆవరించింది. ఇక బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని ఎంతో కొంత వాడుకోవాలనుకుంటోంది బీజేపీ, జేడీయూ. గత నెల రోజులుగా సుశాంత్‌ ఆత్మహత్య వ్యవహారాన్ని బీజేపీ పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది.. ఇక లోక్‌ జన్‌శక్తి పార్టీకి అధికార జేడీయూకు క్షణం పడటం లేదు.. కూటమిలో ఉంటూనే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విమర్శలు కురిపిస్తున్నారు ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌.. తమను కనీస భాగస్వామ పార్టీగా నితీశ్‌ గుర్తించడం లేదన్నది ఎల్‌జేపీ అధినేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రధాన ఆరోపణ. మరి జేడీయూ, బీజేపీ కూటమిలో ఎల్‌జేపీ కొనసాగుతుందా లేక బయటకొచ్చేసి స్వతంత్రంగా పోటీ చేస్తుందా అన్నది చూడాలి..

మా స్నేహం మూనాళ్ల ముచ్చటే.. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం 73 స్థానాలున్న అర్జేడీ ప్రతిపక్షంలో కూర్చింది. జేడీయూ(69), బీజేపీ (54), ఎల్‌జేపీ (2) మద్దతులో నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏళ్ల నాటి బంధాన్ని వదులుకుని నితీష్‌ కుమార్‌ చిరకాల శత్రువు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో దొస్తీ కట్టారు. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌-ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీచేసి విజయాన్ని అందుకున్నాయి. అయితే నితీష్‌-లాలూల స్నేహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తేజ్‌ ప్రతావ్‌ యాదవ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో నితీష్‌ తెగదెంపలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో తాను ప్రభుత్వాన్ని నడపలేనంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇదంతా బీజేపీ, జేడీయూ ఆడిన నాటకమని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి. నితీష్‌ తీరుపై అప్పట్లో జాతీయ స్థాయిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజా ఎన్నికల్లో మరోసారి పాత స్నేహం (బీజేపీ)తో నితీష్‌ బరిలో నిలిచారు. ధీటైన విపక్షం లేకపోవడంతో విజయవకాశాలు దాదాపు ఎన్డీయే కూటమికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్జేడీ కొంతమేర పోటీ ఇచ్చినా.. కాంగ్రెస్‌ మాత్రం కేవలం ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తోంది.

29 ఏళ్లకే లోక్‌సభకు ఎన్నిక లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వములో ప్రస్తుత (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) రైల్వే శాఖా మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్యక్షుడు. యాదవ్ ఏడు సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడచిన రెండు దశాబ్దాలలో బిహార్‌ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభలమైన వ్యక్తి. లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన ధీశాలిగా నిలిచారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా (ఛోటే సాబ్) 1977లో లాలూను లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి, లాలూ తరపున ప్రచారము చేశాడు. ఫలితంగా 29 ఏళ్ల పిన్న వయస్సులోనే 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేవలము 10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బిహార్లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగారు. 1989లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయపథాన నడిపించారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు.

జాతీయ నేత జైలు పాలు.. 1996లో బిహర్‌లో బయటపడిన రూ.950 కోట్ల పశుగ్రాస కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని మార్చివేసింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే అయితే ఈ దర్యాప్తును లాలూనే స్వయంగా విచారణకు ఆదేశించడము విశేషం. 1997లో లాలూ, జనతా దళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నష్టాల్లో నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత యాజమాన్య పద్ధతులకు జాతీయ స్థాయిలో లాలూ ఖ్యాతిగడించారు. ఆసియా టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ “ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము” అని అన్నారు.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత: నితీష్‌ దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉ‍న్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బిహర్‌కు ఓ రాథోడ్‌.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయ నాయకుడు నితిష్‌కుమార్‌. నితీష్‌పై జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్‌మనోహర్‌ లోహియా పార్టీ సంజీవాది యువజన్‌ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్‌నాత్‌ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్‌ దల్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ ఎన్నికయ్యారు.

1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్‌ యునైటెడ్‌ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితీష్‌ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నితీష్‌ కుమార్‌ మొత్తం 13 ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్‌ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్‌ తన భార్యను కోల్పోయారు. తను కుమారుడిని మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంచడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో చాణిక్యుడి చతురత.. వృద్ధనేత వ్యూహాలు ముందు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.