PRASHANTH KISHOR: అటు కాంగ్రెస్‌లో చేరిక.. ఇటు ప్రాంతీయ పార్టీలకు వ్యూహరచన.. రెండు పడవల బాటలో పీకే వ్యూహమిదే!

రెండు విడతలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎంకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా రెండు రోజుల పాటు ఇద్దరు చర్చలు జరిపారు. తన వ్యూహాలను కేసీఆర్‌కు వివరించిన కేసీఆర్.. చాలా కీలకమైన సూచన చేశారు కూడా. అదే తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తిగా మార్చాయి.

PRASHANTH KISHOR: అటు కాంగ్రెస్‌లో చేరిక.. ఇటు ప్రాంతీయ పార్టీలకు వ్యూహరచన.. రెండు పడవల బాటలో పీకే వ్యూహమిదే!
I-PAC Moves
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 25, 2022 | 6:52 PM

PRASHANTH KISHORE KCR MEET INTERESTING POINTS REVEALED: వచ్చే తెలంగాణ (TELANGANA) అసెంబ్లీ ఎన్నికల్లో పోరు త్రిముఖమా? లేక ద్విముఖమా ? లేక బహుముఖమా ?? రెండ్రోజుల నుంచి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(CM Kcr) మధ్య కొనసాగిన ఎడతెగని చర్చల తర్వాత సామాన్యుల్లో మొదలైన ప్రశ్నలివి. 2021లో ఒకట్రెండు సార్లు పీకే, కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో వీరిద్దరు భేటీ అవడం తెలంగాణలో ముందస్తు ఎన్నికలన్న ప్రచారానికి తెరలేపాయి.  తెలంగాణ ఏర్పాటయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ ఎన్నికలు. (2014లో ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగాక తెలంగాణ ఏర్పాటైంది.) 2018లో అనూహ్య వ్యూహంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘనవిజయంతో విపక్షాలకు షాకిచ్చిన గులాబీ బాస్.. ఈసారి మరింత పక్కా వ్యూహంతో మూడోసారి అధికారం చేపట్టే లక్ష్యంతో కదులుతున్నారు. రెండు నెలల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను రంగంలోకి దింపిన కేసీఆర్.. ఆయనందించిన సర్వే నివేదిక ఆధారంగా ఏప్రిల్ 23,24 తేదీలలో సుదీర్ఘ మంతనాలు సాగించారు. తొలిరోజు ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్, పీకే భేటీ జరగ్గా, మలినాడు వీరిద్దరు కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తమ భేటీని కొనసాగించారు. సర్వే నివేదికలు, ఎమ్మెల్యేలలో ఎవరికి మళ్ళీ టిక్కెట్ ఇవ్వాలి? ఎవరికి తిరస్కరించి, కొత్తవారికి ఛాన్సివ్వాలి.. ఇత్యాది అంశాలను పక్కన పెడితే.. పీకే, కేసీఆర్ భేటీలో ప్రస్ఫుటంగా వినిపించిన మాట… బీజేపీ(Bjp)కి జాతీయస్థాయిలో మరోసారి అధికారం దక్కనివ్వవద్దు. బీజేపీని నిలువరించడానికి ఏం చేయాలి ? ఎవరెవరిని కలవాలి? ఏ పార్టీతో పోరాడాలి ? ఎవరితో మైత్రి ఏర్పరచుకోవాలి? ఎవరితో తటస్థంగా వుండాలి? ఇలా కేసీఆర్, పీకేల సంభాషణ కొనసాగినట్లు లీకేజీలు వచ్చాయి. గత రెండు నెలలుగా తెలుగు రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన పెరిగిపోయింది. తొలుత టీఆర్ఎస్ వ్యూహరచన బాధ్యతలను చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహణకు తన బలగాన్ని రంగంలోకి దింపారు. ఐప్యాక్ సంస్థ ద్వారా పీకే బృందం తెలంగాణలో పర్యటించి.. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మళ్ళీ విజయావకాశాలు ఏ మేరకున్నాయి అనే అంశంపై మధింపు జరిపారు. రెండు విడతలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎంకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా రెండు రోజుల పాటు ఇద్దరు చర్చలు జరిపారు. తన వ్యూహాలను కేసీఆర్‌కు వివరించిన కేసీఆర్.. చాలా కీలకమైన సూచన చేశారు కూడా. అదే తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తిగా మార్చాయి. జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ పార్టీకి చోటివ్వాలనేది పీకే ప్రధాన ప్రతిపాదన. నిజానికి బీజేపీ (BJP)కి దూరంగా, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వున్న పార్టీల అధినేతలతోనే కేసీఆర్ భేటీ అవుతూ వస్తున్నారు. బీజేపీయేతర కూటమికి ఆయన ప్రతిపాదిస్తూ వస్తున్నారు. కానీ పైకి మాత్రం బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అంటూ చెబుతున్నారు. కానీ ఆయన కలిసిన వారిలో ఎంకే స్టాలిన్(M.K.Stalin ), శరద్ పవార్(Sharad Pawar), ఉద్ధవ్ థాక్రే వంటి వారు ఆల్ రెడీ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగానే వున్నారు. అందుకే ఓ దశలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట యుపీఏ కూటమిని వీక్ చేస్తున్నారా అన్న సందేహాలు కూడా కలిగాయి. అయితే తాజా పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఓవైపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయ యవనికపై తన అదృష్టా‌న్ని నేరుగా పరీక్షించాలనుకుంటున్న ప్రశాంత్ కిశోర్.. ఇటు తన ఐప్యాక్ సంస్థ సేవలను టీఆర్ఎస్ వంటి పార్టీలకు అందిస్తున్నారు. ఇలా అందిస్తూనే కాంగ్రెస్ పార్టీని తాను ప్రతిపాదిస్తున్న కూటమికి ప్రత్యర్థిగా భావించకూడదని, వీలైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని, అప్పుడే బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమని పీకే అంటున్నారు. ఈమేరకు తన వ్యూహాన్ని ప్రశాంత్ కిశోర్.. గులాబీ బాస్‌కు వివరించారని కథనాలు వచ్చాయి. జాతీయ రాజకీయాల మాటెలా వున్నా.. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు. పైకి బీజేపీని ఎక్కువగా కేసీఆర్ టార్గెట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన ప్రత్యర్థిగానే చూస్తున్నారు. మరి ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేస్తే.. తెలంగాణలో పరిస్థితి ఏంటన్నదిపుడు సామాన్యుని బుర్రను తొలిచేస్తున్న ప్రశ్న. చెలిమి చేయకపోయినా.. కనీసం తటస్థ వైఖరి తీసుకున్నా తెలంగాణలో ఇన్‌డైరెక్టుగా బీజేపీనే తమ ప్రత్యర్థిగా చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బీజేపీ నేతలు చాలా చక్కగా ఉపయోగించుకునే వీలుంది. అయితే.. జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ వేదికలో కాంగ్రెస్ పార్టీకి చోటివ్వాలంటూ పీకే చేసిన సూచనకు కేసీఆర్ విముఖత ప్రదర్శించినట్లు ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండానే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక సాధ్యమని కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది వ్యూహంలో భాగం కావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకొచ్చని, ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీతో స్నేహం కుదిరితే అది అంతిమంగా బీజేపీకే ప్రయోజనకరం కావచ్చని చెప్పుకుంటున్నారు.

ఇక్కడ మరో అంశం కూడా ఆసక్తికరంగా వుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనిచ్చిన పాయింట్లపై కాంగ్రెస్ పార్టీ ఓ ఎక్స్‌టెండెడ్ కమిటీని నియమించింది. April మూడో వారంలో సోనియా, రాహుల్ గాంధీలతో రెండు, మూడు దఫాలు భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ వారికి తాను ప్రిపేర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో పొందుపరిచిన అంశాలను పరిశీలించి, తమకో నివేదిక ఇవ్వాల్సిందిగా సోనియా 8 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించారు. వారు ఏప్రిల్ 21న పీకే ప్రజెంటేషన్ నుంచి తాము సంగ్రహించిన అంశాలతో పార్టీ అధినేత్రికి ఓ నివేదిక ఇచ్చారు. వారి నివేదిక ఆధారంగా ఏప్రిల్ 25వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల సన్నాహకంగా ఓ వార్ గ్రూప్ లాంటి కమిటీని ‘‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024’’ నియమించారు. ఈ యాక్షన్ గ్రూప్ పీకే నివేదిక ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యూహాలు, ప్రచారాంశాలు, రాజకీయ పొత్తులు వంటి అంశాలపై వర్కౌట్ చేయనున్నది. ఈక్రమంలో ప్రశాంత్ కిశోర్‌ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలోను ఈ కమిటీనే ఫైనల్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా కొనసాగుతోంది. పీకే గనక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ మరేఇతర రాజకీయ పార్టీకి పని చేయకూడదన్నది కొందరు కాంగ్రెస్ పెద్దల షరతు అని వినిపిస్తోంది. కానీ పీకే మాత్రం కేసీఆర్‌తో జరిపిన భేటీ సందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు చెందిన ఐప్యాక్ స్వతంత్రంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఓ పార్టీలో కీలక నేతగా, వ్యూహకర్తగా కొనసాగుతూ తన ఆధ్వర్యంలోని ఐప్యాక్ సంస్థని నిస్పక్షపాతంగా ఎలా నడుపగలరన్నది పలువురిలో వ్యక్తమవుతున్న సందేహం.

కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీ ఆయన్ను సంప్రదించినా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా వుండే సూచనలే చేస్తాడన్నది జగమెరిగిన సత్యం. తాజాగా కాంగ్రెస్ పార్టీ పట్ల శతృభావం వద్దని, జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లేదా వేరే ఏదైనా కూటమికి కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షంగానే చూడాలని చెప్పనే చెప్పాడు. పీకే మాటల్లోను, ఆయన సిఫారసుల్లోని కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలను సన్నిహితం చేసే వ్యూహం కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అయితే నేరుగా పొత్తుతో లేకపోతే తటస్థవైఖరితో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. అయితే.. కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దింపుతామని భీషణ ప్రతిఙ్ఞలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తమ పార్టీ పట్ల తటస్థంగానో, అనుకూలంగానో మారితే ఏం చేయాలో తోచక బుర్రలు పట్టుకుంటున్నారు. కేసీఆర్‌తో ఎలాంటి అవగాహన వద్దని వారు తమ అధిష్టానాన్ని కోరుకుంటున్నారు. కొందరైతే కేసీఆర్‌తో కలిసి పని చేస్తున్న పీకేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని కూడా సోనియాను వేడుకుంటున్నారు. అయితే.. జాతీయ స్థాయి ప్రయోజనాలనే ప్రధానంగా చూస్తున్న కాంగ్రెస్ అధినేత్రి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినతులను ఏ మేరకు పరిశీలిస్తారన్నది డౌటే. కేంద్రంలో పదేళ్ళు అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అయితే ప్రత్యక్షంగా.. లేకపోతే పరోక్షంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. పీకే సూచన మేరకు సొంతంగా 377 లోక్‌సభ సీట్లలో పోటీ చేసి.. మెరుగైన ఫలితాలు పొందే స్థితిలో కాంగ్రెస్ పార్టీ వుందా అంటే పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50కి లోపు ఎంపీ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లోను పెద్దగా సానుకూల ఫలితాలు పొందలేదు. పార్టీ పరిస్థితిగానీ, రాహుల్ చరిష్మాగాని మెరుగు పడింది అనడానికి ఏ ఆధారమూ కనిపించడం లేదు. అలాంటి సందర్భంలో సొంతంగా 377 సీట్లకు పోటీ చేసి, మెరుగైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనలేం. సో.. ఎన్డీయే, యుపీఏలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటైతే.. ఫలితాల తర్వాత దానికి కాంగ్రెస్ పార్టీ లేదా యుపీఏ మద్దతు పలికి అధికారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొందేందుకు ప్రయత్నించే అవకాశం వుంది. యుపీఏ పార్టీలు బలంగా వున్న రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ యుపీఏ.. యుపీఏ బలంగా లేని రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ లేదా ప్రత్యామ్నాయ కూటమి పార్టీలు వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వచ్చే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఫలితాల తర్వాత ప్రత్యామ్నాయ కూటమి, యుపీఏ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తాయి. బీజేపీ సొంతంగా లేదా ఎన్డీయే పక్షంగా మేజిక్ మార్కును చేరుకోలేకపోతే ఇది జరిగే అవకాశం వుంది. ఒకవేళ మూడోసారి కూడా మోదీనే అని దేశ ప్రజలు తీర్మానించుకుంటే పీకే వ్యూహాలు, కాంగ్రెస్ యాక్షన్ గ్రూపు చర్యలు, కేసీఆర్ స్ట్రాటెజీ వృధా అయ్యే అవకాశాలూ లేకపోలేదు.