అన్నా.. మీరు జైల్లోనే వుండండన్నా.. చింతమనేనికి కొత్త చిక్కు

ఏపీ పాలిటిక్స్‌లో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారుండరు. ఆ మాటకొస్తే.. చింతమనేని పేరు తెలియని ఆంధ్రుడుండడు అంటే కూడా అతిశయోక్తి కాదేమో. 60కి పైగా కేసులున్న చింతమనేని గత 60 రోజులుగా జైల్లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకిప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట ! 10 సంవత్సరాలపాటు దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఏలూరు జిల్లా జైలులో గత 60 రోజులుగా వున్నారు. […]

  • Updated On - 8:40 pm, Thu, 7 November 19 Edited By: Srinu Perla
అన్నా.. మీరు జైల్లోనే వుండండన్నా.. చింతమనేనికి కొత్త చిక్కు
ఏపీ పాలిటిక్స్‌లో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారుండరు. ఆ మాటకొస్తే.. చింతమనేని పేరు తెలియని ఆంధ్రుడుండడు అంటే కూడా అతిశయోక్తి కాదేమో. 60కి పైగా కేసులున్న చింతమనేని గత 60 రోజులుగా జైల్లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకిప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట !
10 సంవత్సరాలపాటు దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఏలూరు జిల్లా జైలులో గత 60 రోజులుగా వున్నారు. అరెస్టయిన తర్వాత కూడా చింతమనేని మీద కేసుల నమోదు ఆగలేదు సరికదా ఇంకా ఊపందుకుంది. చింతమనేని ఎదుర్కొంటున్న కేసుల్లో అత్యధికం.. ఎస్సీ, ఎస్టీ కేసులే.
జైలులో వున్న చింతమనేని ఎక్కువ సమయం పేపర్ చదవడానికి కేటాయిస్తున్నారని, వాకింగ్ చేయడం తగ్గించి, తోటి ఖైదీలతో బాతాఖానితోనే టైమ్ పాస్ చేస్తున్నారని తెలుస్తోంది. వాకింగ్ తగ్గించడంతో ఆయనకు డయాబెటీస్ పెరిగిందని జైలు డాక్టర్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే జైలులో నాసిరకంగా భోజనం పెట్టడం గమనించిన చింతమనేని జైలుకెళ్ళిన తొలి రోజుల్లో బాగా గొడవ పడ్డారని చెబుతున్నారు. క్వాలిటీ ఆహారం కావాలని గొడవ పెట్టడంతో అది ఉన్నత అధికారుల దృష్టికి వెళితే ప్రమాదమని అనుకున్న జైలు అధికారులు కొంతలో కొంత క్వాలిటీ పెంచినట్లు సమాచారం. ఒక దశలో తన ఖర్చులతో ఖైదీలందరికీ భోజనం పెట్టిస్తానని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించినట్లు చెప్పుకుంటున్నారు.
జైలుకెళ్ళి చింతమనేనిని కలిసి వచ్చిన ఆయన అనుచరులు చెప్పుకుంటున్న కథనాల ప్రకారం.. చింతమనేని తోటి ఖైదీలు.. ఈ మధ్య కొత్త వాదన తెరమీదికి తేవడంత ఆయన అవాక్కయ్యారని తెలుస్తోంది. ఇంతకాలం చౌకబారు తిండితో మంచి ఆహారానికి మొహం వాచిపోయిందని, చింతమనేని రాకతో చక్కని భోజనం దొరకడంతో ఖైదీలు ఆనందపడిపోతున్నారని సమాచారం.
చింతమనేని వల్లే తమకు చక్కని ఆహారం దొరుకుతుండడంతో .. ‘‘ అన్నా..! మీరుంటే మంచి భోజనం దొరుకుతుందన్నా.. మీరు బెయిల్ వచ్చినా బయటికి వెళ్ళొద్దన్నా.. మీరిక్కడే మా మధ్యే వుండండన్నా’’ అంటూ తోటి ఖైదీలు చింతమనేనిని బతిమాలుకుంటున్నారట. దాంతో ప్రభాకర్‌కు వారి అభిమానానికి ఏడవాలో.. నవ్వాలో తెలియక బుర్రగోక్కుంటున్నారని చెబుతున్నారు ఆయన అనుచరులు.
భలే వుంది కదా చింతమనేని  కొత్త చిక్కు !