చంద్రబాబుకు సొంత జిల్లాలో సెగ.. వైసీపీ ప్లాన్ అదుర్స్..!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబుకు దగ్గరగా వుండే నేతలకు గాలమేస్తున్నారు మిగతా వైసీపీ నేతలు. చిరకాలంగా చంద్రబాబు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం వుండగా.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య శతృత్వం తారాస్థాయికి చేరిందని చెప్పుకుంటున్నాయి చిత్తూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్. చిత్తూరులో ఇద్దరు నేతల మధ్య ఫైట్‌ నడుస్తుంటే…మరోవైపు వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు […]

చంద్రబాబుకు సొంత జిల్లాలో సెగ.. వైసీపీ ప్లాన్ అదుర్స్..!
Rajesh Sharma

|

Nov 12, 2019 | 2:26 PM

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబుకు దగ్గరగా వుండే నేతలకు గాలమేస్తున్నారు మిగతా వైసీపీ నేతలు. చిరకాలంగా చంద్రబాబు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం వుండగా.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య శతృత్వం తారాస్థాయికి చేరిందని చెప్పుకుంటున్నాయి చిత్తూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్.

చిత్తూరులో ఇద్దరు నేతల మధ్య ఫైట్‌ నడుస్తుంటే…మరోవైపు వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. జిల్లాలో టీడీపీ పునాదులపై దృష్టిపెట్టింది. కీలక నేతలకు వల వేసే పనిలో పడింది. వైసీపీ నేతల టచ్‌లోకి ఆ నేత వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయన మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు. కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే..మరోవైపు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఇంట్లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కొనసాగింది. డీకే సత్యప్రభ దగ్గరి బంధువైన చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ నేతలు డీకే సత్యప్రభను కలిశారు.

తమిళనాడులోని శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి శ్రీ నారాయణి అమ్మన్‌ డీకే సత్యప్రభ ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన వైసీపీ నేతలు ఆమెతో రాజకీయ మంతనాలు కూడా చేశారని విశ్వసనీయ సమాచారం. ఓవైపు అధినేత చంద్రబాబు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే…మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఇంట వైసీపీ నేతలు హడావుడి చేయడం పార్టీ కేడర్‌లో చర్చకు దారితీసింది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నలుగురు నేతలను ఘనంగా సత్కరించిన సత్యప్రభ…ఫ్యాన్‌ గాలి చెంతకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది.

గతంలో చిత్తూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న డీకే సత్యప్రభను గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ సీటుకు మార్చారు. దీంతో ఆమె అప్పటినుంచి పార్టీ మీద అలకవహించారని సమాచారం. పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. మొత్తానికి సత్యప్రభ వైఖరి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యమే కనిపిస్తోంది. అనాదిగా ప్రత్యర్థులైన చంద్రబాబు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు యత్నిస్తూనే వుంటారు. అయితే.. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం కొనసాగిన చంద్రబాబుదే చాలా సార్లు పైచేయిగా మారింది. తాజాపరిణామాల మధ్య టిడిపి బాగా బలహీన పడుతున్న సందర్భాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి యత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

వాళ్లిద్దరూ రాజకీయాల్లో సమకాలికులే. యూనివర్శిటీ నుంచి అసెంబ్లీకి ఇద్దరి మధ్య పోటీ ఉండేది. 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరికి పడదు. రాజకీయంగా బద్ధ శత్రువులు. వారిద్దరి మధ్య ఇప్పటికీ ఫైట్‌ నడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.

చిత్తూరు జిల్లా… ఏపీ రాజకీయాల్లో కీలక జిల్లా. రాయలసీమలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న ఏరియా. మూడు సార్లు ముఖ్యమంత్రిగా….మూడోసారి ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న చంద్రబాబుకు నాలుగు దశాబ్దాలుగా జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో శత్రుత్వం ఉంది. ఎస్వీ యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో చంద్రబాబుతో పెద్దిరెడ్డి వైరం కొనసాగింది. వర్శిటీలో ఓ వర్గానికి చంద్రబాబు నాయకుడైతే మరో వర్గానికి పెద్దిరెడ్డి నేతగా ఉండేవారు. ఇలా యూనివర్శిటీ నుంచి అసెంబ్లీ రాజకీయాల వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి స్వతంత్రంగానే ఉన్నారు. టీడీపీలోకి ఆయన జంప్‌ అయిన తర్వాత ఈయన కాంగ్రెస్‌లోకి..అక్కడి నుంచి వైసీపీకి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటే…పెద్దిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి. అయితే తన సొంత జిల్లాలో చంద్రబాబు ఇప్పటివరకూ పెద్దిరెడ్డిపై పై చేయి సాధించలేకపోయారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా జిల్లాలో తన రాజకీయ పెత్తనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లోనూ అంతా తానై వ్యవహరించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం మినహా 13 చోట్ల వైసీపీ గెలిపించడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి హవాతో చంద్రబాబు మళ్లీ ఆయన్ని టార్గెట్‌ చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది.

ఒకవైపు టిడిపి నుంచి జంప్ జిలానీల సంఖ్య పెరిగి పోవడం.. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి అసలుంటుందా అన్న స్థాయిలో బిజెపి, వైసీపీ యత్నాలు ముమ్మరం చేయడంతో జిల్లాలో పెద్దిరెడ్డి, చంద్రబాబు ఆధిపత్య పోరు మరోసారి వార్తలకెక్కింది. పరిస్థితిని అడ్వాంటేజ్‌గా మార్చుకునేందుకు పెద్దిరెడ్డి తన అధికార బలాన్ని కూడా వాడుతున్నారు. సో.. ఈసారి పోరు ఆసక్తికరంగా మారుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu