మమతా బెనర్జీ మెడికల్ రిపోర్టును బహిర్గతం చేయాలి, బెంగాల్ బీజేపీ డిమాండ్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెడికల్ రిపోర్టును బహిర్గతం చేయాలని  ఆ రాష్ట్ర బీజేపీ.. ఎన్నికల కమిషన్ ను కోరింది. నందిగ్రామ్ లో మొదట తనపై దాడి జరిగిందని మమత పేర్కొన్నారని, ఆ తరువాత ఇది యాక్సిడెంట్ అన్నారని, నిన్న కోల్ కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారని రాష్ట్ర బీజేపీ ప్రతినిధిబృందం తమ మెమోరండంలో తెలిపింది. 

  • Umakanth Rao
  • Publish Date - 5:09 pm, Mon, 15 March 21
మమతా  బెనర్జీ  మెడికల్ రిపోర్టును బహిర్గతం చేయాలి, బెంగాల్ బీజేపీ డిమాండ్
Mamata Banerjee

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెడికల్ రిపోర్టును బహిర్గతం చేయాలని  ఆ రాష్ట్ర బీజేపీ.. ఎన్నికల కమిషన్ ను కోరింది. నందిగ్రామ్ లో మొదట తనపై దాడి జరిగిందని మమత పేర్కొన్నారని, ఆ తరువాత ఇది యాక్సిడెంట్ అన్నారని, నిన్న కోల్ కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారని రాష్ట్ర బీజేపీ ప్రతినిధిబృందం తమ మెమోరండంలో తెలిపింది.  అందువల్ల డాక్టర్లను ప్రభావితం చేసినట్టు తాము అనుమానిస్తున్నామని,  ఈ కారణంగా ఆమె వైద్య సంబంధ రిపోర్టును బయటపెట్టాలని ఈ బృందం డిమాండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ నేత అర్జున్ రెడ్డి.. తాము ఎన్నికల అధికారికి ఓ లేఖ కూడా అందజేసినట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనం కోసమే, ప్రజల సానుభూతిని పొందేందుకే ఈ ఎటాక్ ఉదంతం జరిగినట్టు తాము భావిస్తున్నామన్నారు. అసలు ఆమెపై ఎలాంటి  దాడి జరగలేదని, ఆమెకు యాక్సిడెంటల్ గా గాయమైందని ఈసీ కూడా  తన నివేదికలో ప్రకటించిందని ఆయన చెప్పారు.

తనకు తాను చేసుకున్న గాయం నుంచి పొలిటికల్ మైలేజీ పొందేందుకు మమత, తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడి ఘటనను సృష్టించాయని ఆయన ఆరోపించారు. అందువల్లే ఆమె మెడికల్ రిపోర్టును బహిర్గతం చేయాలని తాము కోరుతున్నామని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. ఇలా ఉండగా… మమత భద్రతా అధికారి వివేక్  సహాయ్ ని, ఎస్పీ ప్రవీణ్ ప్రకాష్ ని ఈసీ సస్పెండ్ చేస్తూ నిన్న నోటీసులు జారీ చేసింది. బెంగాల్ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో వీరు విఫలమయ్యారని పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని కూడా తెలిపింది.

నిన్న  మమత… కోల్ కతా లో జరిగిన రోడ్ షోలో   వీల్ చైర్ తోనే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. తనను హతమార్చడానికి కుట్ర జరిగిందని, తాను  గాయపడిన పులి లాంటిదానినని  వ్యాఖ్యానించారు. అటు-కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఈ దాడి ఉదంతాన్ని ప్రస్తావించకుండా.. ఈ రాష్ట్రం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ని పారదోలాలని, బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: BMC: సెఫ్టీ విషయంలో తగ్గేదే లేదు.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నటిపై కేసు..

Ram Pothineni and Genelia : రామ్ ను ఆటపట్టించిన జెనీలియా.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన