‘నేను కోబ్రాని, ఒక్క కాటు చాలు’.. బెంగాల్ ర్యాలీలో మిథున్ చక్రవర్తి ‘గర్జన’

బెంగాల్ లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న నటుడు మిథున్ చక్రవర్తి.. ఉత్తేజభరితంగా మాట్లాడాడు.  తాను ఒకప్పుడు నటించిన బెంగాలీ చిత్రంలోని డైలాగును ఆయన ఈ  సందర్భంగా ప్రస్తావించాడు.

  • Umakanth Rao
  • Publish Date - 5:33 pm, Sun, 7 March 21
'నేను కోబ్రాని, ఒక్క కాటు చాలు'.. బెంగాల్ ర్యాలీలో మిథున్ చక్రవర్తి 'గర్జన'

బెంగాల్ లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న నటుడు మిథున్ చక్రవర్తి.. ఉత్తేజభరితంగా మాట్లాడాడు.  తాను ఒకప్పుడు నటించిన బెంగాలీ చిత్రంలోని డైలాగును ఆయన ఈ  సందర్భంగా ప్రస్తావించాడు. ‘నన్ను కోరల్లేని,  హాని చేయని పాము అని అనుకోకండి..నేను విష నాగుని.. ఒక్క కాటుతో అంతం చేయగలను’ అని అన్నాడు. ప్రధాని మోదీ ఇక్కడకు చేరుకోవడానికి కొద్ది సేపటిముందు బీజేపీలో చేరిన ఆయన..తానెప్పుడూ పేదలు, బడుగువర్గాల సంక్షేమం కోసమే కృషి చేయాలనుకుంటూ వచ్చానని, బీజేపీ ఇప్పుడీ అవకాశాన్ని తనకు ఇచ్చిందని అన్నాడు.  ‘బెంగాలీ అయినందుకు గర్వపడుతున్నా..  జీవితంలో ఏదో పెద్ద పని చేయాలనుకున్నా..అయితే ప్రధాని మోదీ వంటి గొప్ప నేత పాల్గొనే ఇంత పెద్ద ర్యాలీలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు’ అని మిథున్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. సమాజంలోని పేద వర్గాల సంక్షేమం కోసం సేవ చేయాలన్న నా ఆశయం నెరవేరబోతోంది అని కూడా ఆయన అన్నారు.

ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో సాన్నిహిత్యం గల నేత గా ఉన్న మిథున్.. ఆ తరువాత శారదా చిట్  ఫండ్ స్కామ్ కారణంగా కొంతవరకు ఆమెకు, పార్టీకి దూరమయ్యారు. రూ.1.2 కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి ఈయనను ఒకప్పుడు ఈడీ విచారించింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవంటూ ఆయన ఈ సొమ్మును ఈ సంస్థకు తిరిగి ఇచ్ఛేసారు. టీఎంసీ ఈయనను రాజ్యసభకు పంపినప్పటికీ రెండేళ్ల అనంతరం ఆరోగ్య కారణాలు చూపి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిథున్ బీజేపీలో చేరుతారా లేక ఈ పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించి తృణమూల్ కాంగ్రెస్ కి మళ్ళీ దగ్గరవుతారా అన్న ఊహాగానాలు నిన్నటివరకు తలెత్తాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఆయన ఆదివారం బీజేపీలో చేరారు. ఇక ఈయనకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతోందన్నది సస్పెన్స్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఐపీఎల్ 2021 రచ్చ.. ఏప్రిల్‌ 9 నుంచి క్రికెట్‌ ప్రేమికుల పండుగ.. ఏ జట్టులో ఎవరున్నారు..!

రేపటి నుంచి మళ్ళీ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల వేళ ..సీనియర్ల గైర్ హాజర్ ?