CONGRESS PRESIDENT: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల ప్రహసనం.. ఆదిలోనే గెహ్లాట్‌కు షాకిచ్చిన రాహుల్.. ఎవరు గెలిచినా కీలుబొమ్మే!

‘‘ నెహ్రూ కుటుంబీకుల కనుసన్నల్లోనే పార్టీ నడవడం ఖాయం. కొత్త అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించడం కల్ల’’ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

CONGRESS PRESIDENT: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల ప్రహసనం.. ఆదిలోనే గెహ్లాట్‌కు షాకిచ్చిన రాహుల్.. ఎవరు గెలిచినా కీలుబొమ్మే!
Sonia Gandhi-Rahul Gandhi - Ashok Gehlot
Rajesh Sharma

|

Sep 23, 2022 | 5:53 PM

CONGRESS PRESIDENT ELECTION PROCESS STARTS RAHUL  SHOCKS GEHLOT: రెండంశాలు తేటతెల్లమయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్(Rahil Gandhi) సుముఖంగా లేరన్న అందులో ఒకటి.  ఆయనే ఈ విషయాన్ని కొచ్చిలో ప్రకటించేశారు. ఇక  ఎవరు పార్టీ అధ్యక్షుడైనా రాహుల్, సోనియా(Sonia Gandhi)ల చెప్పుచేతల్లో వుండాల్సిందేనన్నది రెండో అంశం. ఈ రెండంశాలు కొచ్చి వేదికగానే స్పష్టమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రహసనం సెప్టెంబర్ 22న మొదలైంది. 24వ తేదీ నుంచి అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలనుకునే వారు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. రేసులో ఒకరి కంటే ఎక్కవ వుంటే అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. 19వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటిస్తారు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం 9వేల మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ లెక్కలన్నీ తాజాగా వెల్లడయ్యాయి. ఇదే సమయంలో అధ్యక్ష రేసులో తానుండడం లేదని కూడా రాహుల్ కుండబద్దలు కొట్టారు. తనను కలిసేందుకు వచ్చిన సోనియా నామినీ అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)కు మద్దతిస్తూనే ఓ షాక్ కూడా ఇచ్చారు రాహుల్. తనకు పెద్దగా ఇష్టం లేకపోయినా సోనియా మాట కాదనలేక అధ్యక్ష బరిలోకి దిగిన గెహ్లాట్.. అధినేత్రిని.. మరీ ముఖ్యంగా రాహుల్‌ని ఒప్పించి రాజస్థాన్ సీఎం సీటును కాపాడుకుందామనుకున్నారు. అందుకే తనది నామినేటెడ్ పదవి కాదని, ఎన్నికైన పదవులు కాబట్టి రెండు పదవుల్లో అంటే కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాజస్థాన్ సీఎంగా తాను కొనసాగవచ్చని గెహ్లాట్ భావించారు. ఆ మేరకు సెప్టెంబర్ 21న బహిరంగంగా కూడా మాట్లాడారు. కానీ మర్నాడే రాహుల్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో గెహ్లాట్ ఖంగుతిన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదని, అదో గురుతర బాధ్యత అని చెప్పుకొచ్చిన రాహుల్.. సీఎం సీటులో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగవద్దని గెహ్లాట్‌కు తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అంటే సైద్ధాంతిక అంశాలతో ముడిపడి వుందని.. సో ఒక్క పదవికే పరిమితం కావాల్సి వుంటుందని స్పష్టం చేశారు రాహుల్.  దాంతో వచ్చే నెలలో గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. తనకు తానుగా అధ్యక్ష ఎన్నికలో ఓడితే తప్ప గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం కూడా గెహ్లాట్‌కు షాకిచ్చేలా వుంది. రాహుల్ సూచన మేరకు సీఎం సీటును వదులుకుంటానంటూనే తాను సూచించిన వ్యక్తికి రాజస్థాన్ సీఎం సీటును ఇవ్వాల్సిందిగా గెహ్లాట్ కోరారు. కానీ ఈ విషయంలో కూడా రాహుల్… అశోక్ గెహ్లాట్‌కు దిమ్మతిరిగేలా సమాధానమిచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. గత నాలుగేళ్ళుగా పార్టీ అధిష్టానం సూచన మేరకు సచిన్ పైలట్(Sachin Pilot) పార్టీని వీడకుండా.. పార్టీకి ద్రోహం చేయకుండా విధేయతతో వున్నారని, ఆయనకు సీఎం సీటు ఇవ్వకుండా వుండలేమని రాహుల్ కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. అంటే ఇపుడు తనకిష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని గెహ్లాట్ చేపట్టక తప్పడం లేదు. అదేసమయంలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రాజస్థాన్ సీఎం సీటును వదులుకోవాల్సి వస్తుంది. అది కూడా తనకిష్టం లేని వ్యక్తిని సీఎం సీటులో కూర్చోబెడుతున్నా తానేమీ చేయలేని స్థితిలో గెహ్లాట్ పడబోతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో రాజస్థాన్ సీఎం (Rajastan CM) సీటును ఎవరికి కట్టబెట్టాలనేది తాను నిర్ణయం చేసే అవకాశం వుంది. కానీ ముందే అనుకున్నట్లు అధ్యక్షునిగా ఎన్నికైనా రాహుల్, సోనియాలను కాదని గెహ్లాట్ (ఇంకెవరు ఎన్నికైనా కూడా ఇదే పరిస్థితి) ఏమీ చేయలేరన్నది నిష్టుర సత్యం. సో.. రాజస్థాన్ సీఎంగా ఎవరు కావాలన్నది అయితే రాహుల్, లేకపోతే సోనియా నిర్ణయం తీసుకుంటారు.  ఇంకోరకంగా చెప్పాలంటే గెహ్లాట్ సహా ఎవరు పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైనా .. సోనియా కుటుంబాన్ని కాదని పార్టీని, స్వతంత్రంగా పార్టీని నడిపించలేరు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రాధికార సంఘం ఛైర్మెన్ మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) సెప్టెంబర్ 22న అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు తేలింది. అదేసమయంలో దాదాపు 26 ఏళ్ళ తర్వాత నెహ్రూ కుటుంబీకులు (Nehru Family) లేకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ (Udaipur)లో మొన్నామధ్య జరిగిన చింతన్ శిబిర్‌ (Chintan Shivir)లో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. అదే విధానాన్ని ఇపుడు అశోక్ గెహ్లాట్‌కు ఆపాదించబోతున్నారు. 2018 నుంచి సీఎం సీటు కోసం కాచుకుని, మధ్య మధ్యలో బీజేపీ నేతలు (BJP Leaders) ఎంతగా టెంప్ట్ చేసినా పార్టీ విధేయత వదులుకోని సచిన్ పైలట్‌ కోరిక త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోంది. రాహులే పార్టీ అధ్యక్షునిగా వుండాలని, అందుకు ఆయన్ని ఒప్పించేందుకే కేరళ వెళుతున్నానంటూ కొచ్చి చేరిన అశోక్ గెహ్లాట్ … తానే రాజస్థాన్ సీఎంగాను కొనసాగుతానని ఒప్పించేందుకు విఫల యత్నం చేశారు. రాహుల్‌తో భేటీ తర్వాత మరీ ముఖ్యంగా రాహుల్ మీడియాతో మాట్లాడిన తర్వాత గెహ్లాట్ వాయిస్‌లో స్పష్టమైన మార్పు వచ్చింది. అయితే గెహ్లాట్ ఇచ్చిన ముక్తాయింపు మాత్రం ఇంటరెస్టింగ్‌గా వుంది. రాజస్థాన్ సీఎల్పీలో ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఓ నర్మగర్భ వ్యాఖ్య చేసి వదిలేశారు గెహ్లాట్. సో.. తాను పదవిని వదులుకున్న తర్వాత కొత్త సీఎంను ఎన్నుకునేందుకు జరిగే సీఎల్పీ సమావేశంలో ఏం జరుగుతందన్నది కాస్త ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 24న అశోక్ గెహ్లాట్‌తో పాటు శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు రేసులో మరికొన్ని పేర్లు కూడా యాడ్ అయ్యాయి.  మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్ (Digvijai Singh), కమల్‌నాథ్‌ (Kamalnath)ల పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. ముకుల్ వాస్నిక్ (Mukul Vasnik) పేరు కూడా వినిపించినా తాను రేసులో లేనని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇదిలా వుంటే అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన శశిథరూర్‌పై పార్టీ నేతలు విమర్శలు చేయడం మొదలైంది. పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్.. శశిథరూర్ వైఖరిపై విమర్శలు చేశారు. శశిథరూర్ పార్టీకి చేసిన మేలు ఏమైనా వుంది అంటే కరోనాతో మంచాన పడిన సోనియాకు లేఖ రాయడమేనని గౌరవ్ వ్యంగ్యోక్తి విసిరారు. అయితే.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీ వర్గాలెవరు ఎవరిపైనా కామెంట్లు చేయకూడదని సోనియా ఆదేశించినట్లు సమాచారం. సోనియా సూచన మేరకు జైరాం రమేశ్ ఈ మేరకు పార్టీ నేతలకు సర్క్యులర్ జారీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అధినేత్రి కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు.. రాహుల్‌కు అన్ని విధాలా బైండోవర్ అయ్యే వ్యక్తినే అధ్యక్షునిగా చేయబోతున్నట్లు క్రమంగా క్లారిటీ వస్తోంది. ఇదే జరిగితే ‘‘ నెహ్రూ కుటుంబీకుల కనుసన్నల్లోనే పార్టీ నడవడం ఖాయం. కొత్త అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించడం కల్ల’’ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu