ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. రెవెన్యూ అసోసియేషన్లో VRO సంఘం మళ్లీ కలుస్తుందనే ప్రచారం కొత్త రచ్చకు దారితీస్తోంది. VROల ప్రమోషన్ల దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు సంఘాల నేతల మధ్య విభేదాలకు దారితీస్తోంది.
VROల సంఘాలు రెండు మళ్లీ బొప్పరాజు వెంకటేశ్వర్లు దగ్గరకు వెళుతున్నాయన్న ప్రచారంతో… కొందరు ఉద్యోగ సంఘాల నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. దానిపై మధ్యాహ్నం భేటీ అయి… సంచలన విషయాలు బయటపెడతానన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
అన్ని విషయాలు మధ్యాహ్నం చెబుతానన్నాని, VRO సంఘం నేతలను కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు బొప్పరాజు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు వచ్చాయి. సీఎస్ సమక్షంలోనే కొందరు నేతలు వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు VROల ప్రమోషన్ల అంశం మరోసారి సంఘాల నేతల మధ్య విభేదాలకు దారితీసింది.
కాగా, గతంలో పంచాయతీ ఎన్నికల విషయంలో తొలుత కలిసికట్టుగానే ఉన్నప్పటికీ అనంతరం ఉద్యోగులు చీలిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి సహకరించేంది లేదు. మా ప్రాణాలకంటే ఎన్నికలు ముఖ్యమా అంటూ మొండికేసిన ఉద్యోగ సంఘాల వైఖరిలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మార్పు వచ్చింది.
సచివాలయ ఉద్యోగుల సంఘ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ వెంకట్రామిరెడ్డిపై అమరావతి ఉద్యోగుల సంఘం మండిపడింది. సచివాలయానికి వెళ్లినప్పుడు ఆయన దారుణంగా ప్రవరిస్తున్నారని విమర్శలు చేశారు రెవెన్యూ ఉద్యోగులు. వెంకట్రామిరెడ్డి ప్రవర్తన సరిగా లేదని… ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అమరావతి ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. వెంకట్రామిరెడ్డికి.. కిందిస్థాయి ఉద్యోగులకు అసలు సంబంధాలే లేవని బొప్పరాజు అన్నారు.
మొత్తానికి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల మధ్య చెలరేగిన వివాదం మరోసారి రచ్చకు దారి తీయడం ఆసక్తిగా మారింది.
Read more: