Telangana: తెలంగాణ నుంచి ఉన్నది ఒక్క రాజ్యసభ సీటే.. రేసులో ముందున్న ఆ ఒక్కరు ఎవరంటే..

Telangana: తెలంగాణ నుంచి ఉన్నది ఒక్క రాజ్యసభ సీటే.. రేసులో ముందున్న ఆ ఒక్కరు ఎవరంటే..
Trs Rajyasabha

ఉన్న‌ది ఒక్క సీటు.. పదుల మంది ఆశావహులు. రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయో..? అధినేత మనసులో ఏముందో..? ఎవరికీ తెలియదు. కానీ, నేతలు మాత్రం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసలింతకూ ఆ ఆఫర్‌ ఏంటి..?

Sanjay Kasula

|

May 13, 2022 | 1:10 PM

రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha) ఈనెల 24న నోటిఫికేషన్‌ రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 3 వరకు గడువు ఉంది. జూన్‌ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఉన్న‌ది ఒక్క సీటు.. పదుల మంది ఆశావహులు. రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయో..? అధినేత మనసులో ఏముందో..? ఎవరికీ తెలియదు. కానీ, నేతలు మాత్రం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసలింతకూ ఆ ఆఫర్‌ ఏంటి? రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న బండా ప్ర‌కాశ్‌ను.. గులాబీ బాస్‌ అనూహ్యంగా ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల కమిషన్‌ ఎలక్షన్‌ షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఉన్న‌ది ఒక్క ఎంపీ సీటే అయినా… ఈ స‌మ‌యంలో ఆ అవ‌కాశం ఎవరికి దక్కుతుందనే విషయం ఇప్పుడు కీలకంగా మారింది. ఓవైపు ముంద‌స్తు ఎన్నిక‌లనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మరోవైపు, జాతీయ రాజ‌కీయాల‌వైపు స్పీడ్ పెంచారు అధినేత కేసీఆర్‌. రాష్ట్రంలో ఎన్నిక‌లు, కేంద్రంతో యుధ్దం… ఈ రెండు అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా రాజ్య‌స‌భ ఎంపీ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

రాజ్య‌స‌భ రేసులో కరీంనగర్‌ మాజీ ఎంపీ, ప్రణాళికసంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎంపీగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న వినోద్‌ను ఢిల్లీకి పంపితే నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో పార్టీకి మరింత సహకారం లభిస్తుందని కేసీఆర్‌ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రానున్న పార్లమెంట్‌ఎన్నిక‌ల్లో మళ్లీ క‌రీంన‌గ‌ర్ నుంచి ఆయనే బరిలో నిలవాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ అవ‌కాశం ఇస్తారా? లేదా ? అనేది అనుమానమేనన్న వాదనా వినిపిస్తోంది.

ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అధిష్టానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. మూడేళ్ళుగా ప‌ద‌వికోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి కూడా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నామా నాగేశ్వ‌ర్రావును కాద‌ని ఈయ‌న‌కు టికెట్ కేటాయించే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. కాబట్టి, రాజ్యసభ సీటు భర్తీ విషయంలో పొంగులేటి పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ద‌ళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్‌.. ద‌ళిత ఎజెండాతో ముందుకు వెళుతున్నారు. దళితోద్ధరణకు.. దేశవ్యాప్తంగా ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కం తీసుకురావాలని కేంధ్ర ప్ర‌భుత్వాన్నీ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కోణంలో చూస్తే… మెత్కుప‌ల్లి న‌ర్సింహులుకు రాజ్య‌స‌భ‌ సీటిస్తారనే చర్చ జరుగుతోంది. మాదిగ వర్గానికి చెందిన మెత్కుప‌ల్లిని పెద్ద‌ల స‌భకు పంపడం ద్వారా.. ద‌ళితుల‌కు టిఅర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను గట్టిగా వినిపించవచ్చని పార్టీ భావిస్తోంది.

సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పేరు కూడా రాజ్య‌స‌భ ఆశావ‌హుల లిస్ట్‌లో కనిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల నుంచే.. కేసీఆర్‌తో పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తున్న ప్రకాశ్‌రాజ్‌.. ప్రతీ అంశంలో తన మ‌ద్దతు తెలుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇమేజ్‌ ఉంది. కాబట్టి, కేసీఆర్‌ ఆయనను రాజ్య‌స‌భ‌కు పంపి, జాతీయ రాజ‌కీయాల్లో కొ ఆర్డినేటర్‌గా నియమిస్తారనే ఉహ‌గానాలూ వినిపిస్తున్నాయి. ఏ ప్రచారం ఎలా ఉన్నా… చివరికి అవకాశం ఎవరికి దక్కినా… షెడ్యూల్‌ ప్రకారం పదవీకాలం రెండున్న సంవ‌త్సరాలు మాత్ర‌మే దక్కనుంది. ఆ తర్వాత తప్పుకోక తప్పదు. అయితే, ఏన్నాళ్లున్నా, పదవి పదవే కాబట్టి… చాలామంది ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో బిజీ అయ్యారు. మరి ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu