భారత సైనికులపై చైనా ఆర్మీ ఆటవిక దాడి !

రాళ్లు రువ్వుకుంటే అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుందా? మరి ఒకేసారి 20 మంది భారత సైనికుల ప్రాణాలను తీయడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసింది? చైనా ఆర్మీ దాడులపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి..!

భారత సైనికులపై చైనా ఆర్మీ ఆటవిక దాడి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 5:12 PM

భారత్ చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో చైనా ఆర్మీ వాడిన ఆయుధాలేంటీ? రాళ్లు రువ్వుకుంటే అంతమంది ప్రాణాలను కోల్పోవడానికి అవకాశం ఉంటుందా? మరి ఒకేసారి 20 మంది భారత సైనికుల ప్రాణాలను తీయడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసింది? ఎలాంటి మారణాయుధాలను ఉపయోగించింది? ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. చైనా ఆర్మీ దాడులపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ ఘర్షణలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 45 మంది సైనికులు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు చైనా ఆర్మీ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. పదునైన మేకులు గుచ్చిన ఇనుప రాడ్లను చైనా సైనికులు ఉపయోగించినట్టు తెలుస్తోంది. వీటితోనే వెనుక వైపు నుంచి భారత జవాన్లపై విరుచుకుపడ్డారని నిర్దారణకు వస్తున్నారు. భారత్ చైనా భూభాగాలను వేరే చేసే వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ప్రదేశం నుంచి ఆర్మీ అధికారులు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గానీ, రక్షణశాఖ అధికారులుగానీ ధృవీకరించ లేదు. మేకులు గుచ్చిన ఇనుప రాడ్లకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రాడ్లతోనే చైనా సైనికులు భారత జవాన్లను దొంగదెబ్బ తీశారని ప్రచారం జరుగుతోంది. ఆటవికులు కూడా అలాంటి దాడులు చేయబోరని నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. ఆధునిక కాలంలోనూ చైనా ఆటవిక యుద్ధనీతిని పాటిస్తోందంటూ మండిపడుతున్నారు. భారత సైనికులపై అమానవీయంగా దాడులు చేసి, 20 మందిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు.