వివాహవిందులో చెట్టపట్టాల్.. గంటా, నారాయణ రూటు అటేనా?

ఓవైపు రాజధాని రగడ, మరోవైపు వైసీపీ, బీజేపీలతో ప్రతీ రోజు వాగ్యుద్దాలు.. అయితేనేం ఛాన్స్ దొరికితే చాలు తెలుగుదేశం నేతలు ఎంచక్కా ఫంక్షన్లకు హాజరవుతూ ప్రత్యర్థి పార్టీల నేతలతో కబుర్లలో మునిగితేలుతున్నారు. దానికి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనయుని వివాహం తాజాగా వేదిక అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులనే మాట పక్కన పెడితే పార్టీలు వేరైనా.. పైకి తెగ విమర్శలు చేసుకున్నా.. ఒకరిపై మరొకరు నిప్పులు గక్కుకున్నా.. సందర్భం వస్తే […]

వివాహవిందులో చెట్టపట్టాల్.. గంటా, నారాయణ రూటు అటేనా?
Follow us

|

Updated on: Feb 08, 2020 | 6:13 PM

ఓవైపు రాజధాని రగడ, మరోవైపు వైసీపీ, బీజేపీలతో ప్రతీ రోజు వాగ్యుద్దాలు.. అయితేనేం ఛాన్స్ దొరికితే చాలు తెలుగుదేశం నేతలు ఎంచక్కా ఫంక్షన్లకు హాజరవుతూ ప్రత్యర్థి పార్టీల నేతలతో కబుర్లలో మునిగితేలుతున్నారు. దానికి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనయుని వివాహం తాజాగా వేదిక అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులనే మాట పక్కన పెడితే పార్టీలు వేరైనా.. పైకి తెగ విమర్శలు చేసుకున్నా.. ఒకరిపై మరొకరు నిప్పులు గక్కుకున్నా.. సందర్భం వస్తే మంచి మిత్రులమని చాటుకుంటామని నిరూపించారు ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులు.

సీఎం రమేశ్ తనయుని వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది. తనయుని మ్యారేజ్ ఎంగేజ్మెంట్‌నే దుబాయ్‌లో చేసిన సీఎం రమేశ్ పెళ్ళిని హైదరాబాద్‌ నభూతో నభవిష్యతి అన్న చందంగా చేశారు. దీనికి తన పాత, కొత్త మిత్రులను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. దాంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక్కడి వరకూ బాగానే వున్నా.. ఇక్కడే అసలు ట్విస్టు దాగి వుంది.

టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన సీఎం రమేశ్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చేరడం కూడా ఆషామాషీగా జరగలేదు. ఏకంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని నిట్టనిలువునా చీల్చి మరీ బీజేపీలో చేరారు. దాంతో చంద్రబాబు అవాక్కయ్యారని కొందరు.. కాదు.. చంద్రబాబుకు తెలిసే అంతా జరిగిందని మరికొందరు చెప్పుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి వివాహ విందులో పలువురు టీడీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

అమరావతి ఏరియాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ, గత ఆరు నెలలుగా టీడీపీతో అంటీముట్టనట్లుంటున్న గంటా శ్రీనివాస్ రావు.. తదితరులు సీఎం రమేశ్ తనయుని పెళ్ళిలో సందడి చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదంతా ఒకెత్తైతే.. నారాయణ, గంటాల సందడే పెళ్ళిలో హైలైట్ అంటున్నారు టీడీపీ వర్గాలు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణ వాటిపై రాజకీయంగా స్పందించకుండా.. కూల్‌గా వివాహ విందుకు హాజరవడం ఏంటని టీడీపీలో చర్చ జరుగుతోంది.

ఏది ఏమైనా రాజకీయ నాయకుల మాటలకు చేతలకు పొంతన వుండదనేది తాజాగా మరోసారి నిరూపణ అయ్యిందన్న కామెంట్లు ఇప్పుడు జోరందుకున్నాయి.