Big Story: ఢిల్లీ చేరిన సచిన్ పైలట్ …..రాజస్తాన్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం..

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్న డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన విధేయులైన 16 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరుకున్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా..

Big Story: ఢిల్లీ చేరిన సచిన్ పైలట్ .....రాజస్తాన్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 12, 2020 | 2:00 PM

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్న డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన విధేయులైన 16 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరుకున్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా వీరి వెంట ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని, తనను పక్కన పెడుతున్నారని సచిన్ పైలట్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరనున్నారు. శనివారం పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ని కలిసినపైలట్.. .. తమ రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఆయనకువివరించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా సచిన్ పైలట్ కలుసుకుంటారని తెలుస్తోంది. దాదాపు మూడు నెలల క్రితమే మధ్యప్రదేశ్ లో పవర్ ఫుల్ నేత జ్యోతిరాదిత్య సింధియా తనకు విధేయులైన 23 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో వాలి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం , కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రాజస్థాన్ లోనూ కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఈ నాటివి కావు. గత లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడి ఓటమికి పైలటే కారకుడని గెహ్లాట్ ఆరోపించడం, దాన్ని పైలట్ ఖండించడం తెలిసిందే.

శనివారం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు అశోక్ గెహ్లాట్ నిర్వహించిన సమావేశానికి పైలట్ గైర్ హాజరయ్యారు. కాగా..మధ్యప్రదేశ్ లో మాదిరి తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంద్వారా బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టి.. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి ఆ పార్టీ 15 కోట్లు ఇవ్వజూపుతోందని, ఇతర తాయిలాలను కూడా ఎర వేస్తోందని ఆయన అంటున్నారు. అయితే బీజేపీ యత్నాలను సాగనివ్వబోమన్నారు. తమ ఎమ్మెల్యేలను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునన్నారు. సచిన్ పైలట్ వర్గం  బీజేపీతో టచ్ లో ఉందని గెహ్లాట్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

అటు-200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు 107 మంది ఉన్నారు. 12 మంది స్వతంత్ర సభ్యులతో బాటు.. రాష్ట్రీయ లోక్ దళ్, సీపీఎం, భారతీయ ట్రైబల్ పార్టీ సభ్యులు కూడా గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. అయితే సచిన్ పైలట్ రూపంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ ని, అశోక్ గెహ్లాట్ ని.. ఇద్దర్నీ  పిలిపించి చర్చలు జరిపి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి యత్నించవచ్ఛునని అంటున్నారు.