నాకు కేరళ, వారణాసి రెండూ సమానమే: నరేంద్ర మోదీ

PM, నాకు కేరళ, వారణాసి రెండూ సమానమే: నరేంద్ర మోదీ

శనివారం కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల నాడీని పట్టడంలో రాజకీయ విశ్లేషకులు, పండితులు విఫలమయ్యారని మోదీ వ్యాఖ్యానించారు. మరోసారి భాజపాకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. . కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మోదీ ప్రజల మధ్యకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై తనకు ఎంత ప్రేమ ఉందో కేరళపై కూడా అంతే ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ప్రాంతం తనకు సమానమని తెలిపారు. అందుకే తాజా ఎన్నికల్లో కేరళ నుంచి ఒక్క భాజపా అభ్యర్థి గెలుపొందనప్పటికీ.. తన తొలి పర్యటనకు రాష్ట్రాన్ని ఎంచుకున్నానన్నారు.

ఎన్నికల్లో విజయం సాధించిన పక్షంగా దేశంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు. భాజపాను ఓడించిన వారు కూడా తమ పక్షమేనని వ్యాఖ్యానించారు. భాజపా కేవలం ఎన్నికల లబ్ధి కోసం పనిచేయడం లేదని.. దేశ పటిష్ఠ నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో కలకలం రేకేత్తించిన నిఫా వైరస్ నియంత్రణకు కేంద్ర నుంచి తగిన సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

అంతకు ముందు గురువాయూర్‌లోని శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ.. ఆలయ ప్రాంగణంలో జరిగిన తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేరళ నుంచి మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *