
కళ్ళు, బాహ్య రూపం: చేపలు తాజాగా ఉన్నాయా లేదా అన్నది వాటి కళ్లను చూసి మన గుర్తించవచ్చు. ఎలా అంటే తాజా చేపల కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ, స్పష్టంగా ఉంటాయి. కళ్ళు మసకగా లేదా లోపలికి మునిగిపోయినట్లు ఉంటే, అది చాలా కాలం పాటు నిల్వ ఉంచిన చేప అని అర్థం. అలాగే తాజా చేప అయితే దాని చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది. పొడిగా మారినా లేదా రంగు మారినా అలాంటి చేపలను అస్సలు తీసుకోవద్దు.

మొప్పల రంగు : చేపలు తాజాగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడంలో దాని మొప్పల కీలక పాత్ర పోషిస్తాయి. తాజా చేపలలో మొప్పలు సాధారణంగా ముదురు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. అదే ఎక్కువ కాలం నిల్వ ఉన్న చేపలలో అయితే అవి గోధుమ రంగులోకి లేదా వెలసిపోయినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి కొనే ముందు ఈ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.

వాసనను బట్టి గుర్తించడం: చేపలను కొనేటప్పుడు వాటి వాసనను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తాజా చేపలకు సముద్రం లేదా నీటి సహజమైన వాసన మాత్రమే ఉంటుంది. తీవ్రమైన దుర్వాసన వస్తున్నట్లయితే అది పాడైపోయిందని అర్థం. కొందరు ఈ వాసన బయటకు రాకుండా మంచు లో పెట్టి అమ్మినప్పటికీ, కాస్త తేడాగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

చేతితో తాకి చూడటం: చేప శరీరాన్ని తాకి కూడా మనం చేప తాజాగా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీరు చేప శరీరంపై నొక్కినప్పుడు అది మెత్తగా అయిపోయి, ముక్కలు ఊడిపోయేలా ఉంటే అది తాజాది కాదని అర్థం. చేతితో మెల్లగా నొక్కినప్పుడు ఆ భాగం వెంటనే సాధారణ స్థితికి వస్తే అది తాజా చేప అని అర్థం. చేప శరీరం బాగా వాలిపోయినా లేదా జిగటగా ఉన్నా కూడా దానిని కొనకండి.

మొత్తంగా చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, నాణ్యమైన వాటిని ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం. ఇలా పోయామా అలా కొనుక్కొని వచ్చామ అని కాకుండా కాస్త టైం తీసుకొని తాజా చేపలను కొనుక్కొండి. ముఖ్యంగా కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. రూపం, వాసన, మొప్పల, శరీరాన్ని పరిశీలించి చేపలను కొనడం మంచిది. ఈ సారీ వెళ్లినప్పుడు వీటిని అన్ని చెక్ చేసి చేపలు కొనండి.