భారత్‌కు వీసాల జారీ.. చిక్కులేవీ లేవన్న కేంద్రం

గత ఐదు సంవత్సరాల కాలంలో 67 నుంచి 72 శాతం హెచ్1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం భారతీయులకు జారీ చేసిందని విదేశాంగమంత్రి జయశంకర్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు స్పందించిన ఆయన.. హెచ్‌1బీ వీసాల జారీలో ఇప్పటివరకు పెద్దగా మార్పులు జరగలేదని అన్నారు. హెచ్‌1బీ వీసాల విషయంలో తలెత్తే సమస్యలపై అమెరికా ప్రభుత్వం, వాటాదారులతో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అమెరికా విదేశాంగమంత్రి మైఖేల్ ఆర్ పొంపేయో భారత్‌కు వచ్చినప్పుడు కూడా దీనిపై చర్చించామని పేర్కొన్నారు. హెచ్‌1బీ వీసాల విషయం ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమని మైక్‌కు తాము వివరించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాలలో భారతీయులకు ఇచ్చిన వీసాలపై గణాంకాలను తమకు చూపారని తెలిపారు.

ఆ డేటా ప్రకారం 2018లో 1,25,528.. 2017లో 1,29,097.. 2016లో 1,26,692.. 2015లో 1,19,952 భారతీయులకు హెచ్‌1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. భారత ప్రొఫెషనల్స్ అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాలు ఎంతగానో సహకరిస్తాయని ఆయన వెల్లడించారు. ఇక హెచ్1బీ వీసా కార్యక్రమానికి సంబంధించి యూఎస్ ప్రభుత్వం కొన్ని పరిపాలనా చర్యలను అవలంభించిందని…. అందులో భాగంగా హెచ్1బీ వీసాలకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లను స్క్రూటీని చేస్తున్నట్లు జయశంకర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *