భారత్ వల్లే.. శ్రీలంక క్రికెటర్లు పాక్ రావడం లేదు.. పాక్ మంత్రి

Pakistan Minister Blames India For Sri Lanka Players' Tour Boycott, భారత్ వల్లే.. శ్రీలంక క్రికెటర్లు పాక్ రావడం లేదు.. పాక్ మంత్రి

పాక్ మంత్రి మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఇంతకు ముందు చంద్రయాన్‌ 2 ప్రయోగం సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌.. తాజాగా శ్రీలంక క్రికెటర్లు పాక్ టూర్‌ను విరమించుకోడానికి భారత్ కారణమంటూ ఆరోపించారు.సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం కానున్న పాక్ పర్యటనకు వెళ్లమంటూ పదిమంది శ్రీలంక క్రికెటర్లు ప్రకటించారు. గతంలో పాక్‌లో సీరీస్ కోసం వెళ్లగా.. ప్రాక్టీస్ చేస్తుండగా లంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అప్పటినుంచి దాదాపు అన్ని దేశాలు పాక్‌లో మ్యాచులను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలోనే పాక్ టూర్‌కు వెళ్లమంటూ పది మంది సీనియర్ క్రికెటర్లు తేల్చిచెప్పారు. అయితే దీనికి కారణం భారత్‌ అంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్‌కు రాకుండా.. శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరించిందన్నారు. పాకిస్థాన్‌లో పర్యటిస్తే.. తమ ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని భారత్ భయపెట్టిందని.. అందుకే వారు రాలేదంటూ ట్వీట్ చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి అక్టోబరు 9 వరకు పాక్‌లో శ్రీలంక జట్టు పర్యటించాల్సి ఉంది. ఈ టూర్‌లో లంక ఆటగాళ్లు ఆతిథ్య పాక్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే టీ20, వన్డే జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న లసిత్‌ మలింగా, దిముత్‌ కరుణరత్నే సహా పది మంది టాప్‌ ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు నిరాకరించారు. గతంలో పాక్‌తో టెస్టు సందర్భంగా లాహోర్‌లో లంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ దాడిని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల రీత్యా తాము పాక్‌ పర్యటనకు రాలేమని లంక ఆటగాళ్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *