గానగంధర్వుడికి పద్మనాభస్వామి దర్శన భాగ్యం కలగకపోవచ్చు!

ఆలయంలో అనంతమైన ధనరాశులు ఉన్నాయన్నది ఓ బలమైన నమ్మకం.. ఆయన గళంలో అద్భుతమైన స్వరసంపద ఉందన్నది నిఖార్సైన వాస్తవం.. నేలమాళిగలోని బీ ఛాంబర్‌ తలుపులు ఎప్పుడు తెరుస్తారు? జేసుదాసు కోసం ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు? వీటికి వీలైనంత త్వరగా సమాధానాలు దొరికితే బాగుండనుకుంటున్నారు సామాన్య జనం.

గానగంధర్వుడికి పద్మనాభస్వామి దర్శన భాగ్యం  కలగకపోవచ్చు!
Follow us

|

Updated on: Jul 13, 2020 | 4:45 PM

కేర‌ళలోని తిరువనంతపురంలో కొలువైన అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ఆలయ నిర్వ‌హ‌ణ బాధ్య‌త ట్రావెన్‌కోర్ రాజ‌కుటుంబానికే ఉండ‌టాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఆలయ నిర్వహణ వివాదం కొలిక్కి వచ్చింది కానీ సమాధానాలు దొరకని రెండు ప్రశ్నలపై సామాన్య జనం ఆసక్తి ఇంకా అలాగే ఉంది.. ఆలయం నేలమాళిగలో అపారమైన సంపద ఉన్నట్టుగా చెబుతున్న బీ ఛాంబర్‌ను తెరుస్తారా లేదా అన్నది మొదటిదైతే, ప్రముఖ గాయకుడు జేసుదాసుకు ఆలయ ప్రవేశం లభిస్తుందా లేదా అన్నది రెండోది!

ఆలయంలో అనంతమైన ధనరాశులు ఉన్నాయన్నది ఓ బలమైన నమ్మకం.. ఆయన గళంలో అద్భుతమైన స్వరసంపద ఉందన్నది నిఖార్సైన వాస్తవం.. నేలమాళిగలోని బీ ఛాంబర్‌ తలుపులు ఎప్పుడు తెరుస్తారు? జేసుదాసు కోసం ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు? వీటికి వీలైనంత త్వరగా సమాధానాలు దొరికితే బాగుండనుకుంటున్నారు సామాన్య జనం.

పద్మనాభస్వామి ఆలయానికి 14 వందల చరిత్ర ఉంది. 16 శతాబ్ధం నుంచి ఇది ట్రావెన్‌కోర్‌ రాజుల చేతుల్లోకి వెళ్లింది. దాంతో ఆలయ సంపదా పెరిగింది.. 18 శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ కాలంలో చాలా మంది కన్ను ఈ ఆలయంపై ఉండింది.. అందుకే సంపదనంతా నేలమాళిగలో భద్రపరిచారు. ఆలయం నేలమాళిగలో మొత్తం ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే చాంబర్‌లున్నాయి. వీటిలో లక్షలాది కోట్ల విలువైన సంపద నిక్షిప్తమై ఉందట! సీ, డీ, ఈ, ఎఫ్ చాంబర్‌లను గతంలోనే తెరిచారు. కానీ 1860 సంవత్సరం నుంచి ఏ, బీ చాంబర్‌లను ఎవరూ తెరవలేదు. బీ చాంబర్‌లో అనంతమైన సంపద ఉందని, అందుకే దాని రక్షణ కోసం నాగబంధం వేశారని చెబుతుంటారు. అదో బలమైన విశ్వాసం.. అందుకే ఆ గదిని తెరిచేది లేనిది ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే వదిలేసింది సుప్రీంకోర్టు.

నిజానికి 1930లోనే కొందరు ఆరో గదిలోని సంపదను దోచుకోవాలనుకున్నారు కానీ, అప్పట్లో నల్లత్రాచులు వారిని వెంటాడంతో అక్కడి నుంచి పారిపోయారట! వందేళ్ల క్రితం తీవ్రమైన కరువు సంభవించినప్పుడు నేలమాళిగ లోని ఆరోగదిని తెరిచే ప్రయత్నం చేశారట. అప్పుడు ఆ గది నుంచి సముద్ర గర్జనలు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట! ఎవరైనా తెరిస్తే మాత్రం ఆలయాన్ని సముద్రం ముంచెత్తడం ఖాయమంటున్నారు కొందరు. అయితే ఆలయ ఆస్తులను ఆడిట్‌ చేసేందుకు వచ్చిన కాగ్‌ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాత్రం ఇవన్నీ అవాస్తవాలన్నారు. 1990లోనే బీ చాంబర్‌ను కనీసం ఏడు సార్లు తెరిచి ఉంటారని ఆయన తన నివేదికలో వెల్లడించారు. పైగా 266 కిలోల బంగారం మాయమయ్యింది సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిటింగ్‌ నివేదికలో చెప్పారు కూడా! సుప్రీంకోర్టు ఆలయ బాధ్యతను ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే వదిలేసింది కాబట్టి ఆ రాజకుటుంబానికి ఆ గదిని తెరిచే ఆలోచన ఉందో లేదో తెలియాలి.. ఒకవేళ ఉంటే ఆ ఆరవ గదిని తెరిచే సాహసం ఎవరు చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఇక గాన గంధర్వుడు జేసుదాసు విషయానికి వస్తే అనంత పద్మనాభస్వామిని దర్శించుకోవాలన్నది ఆయన చిరకాల వాంఛ.. ఓ సుందర స్వప్నం. ఆ పద్మనాభుడికి దయలేదో, ఆలయ నిర్వాహకులకు కరుణ లేదో తెలియదు కానీ ఆ కల ఇప్పటికీ నెరవేరలేదు.. 2017, సెప్టెంబర్‌లో ఆలయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఓ అర్జీ పెట్టుకున్నారు జేసుదాసు. తాను క్రైస్తవుడినే అయినా హిందూ ధర్మం మీద తనకు అపారమైన విశ్వాసం ఉందని, హిందు సంప్రదాయాల ప్రకారం ఆలయంలో ఆచారాలను పాటిస్తానని ప్రమాణం చేస్తూ వినతి చేసుకున్నారు.. ఆలయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆయనకు ఆలయ ప్రవేశం కల్పించింది.. సెప్టెంబర్‌ 18న ఆలయానికి రావచ్చని కమిటీ చెప్పింది కానీ జేసుదాసు మాత్రం పద్మనాభస్వామిని దర్శించుకోలేకపోయారు. కారణం షెడ్యూల్‌లో ఉన్న అయోమయం. నెల తర్వాత ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి చెందిన అశ్వథి తిరునాల్‌ గౌరీ లక్ష్మీ బాయి మాత్రం హిందు ఆలయాన్ని ఎవరు పడితే వారు దర్శించుకోడానికి వీల్లేదని తేల్చేశారు. పద్మనాభస్వామి ఆలయాన్ని హిందూయేతరులు దర్శించుకోవడానికి అదేం విశ్వవిద్యాలయమో, సాంస్కృతిక కేంద్రమో కాదని స్పష్టం చేశారు.. ఈ మాటలు ఎవరి గురించి అన్నవో లోకానికి తెలుసు.. జేసుదాసుకూ తెలుసు.. అందుకే మళ్లీ ఆయన ఆలయ సందర్శన ప్రయత్నం చేయలేదు.. పద్మనాభస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.. ప్రతీ ఏడాది సంగీత విద్వాంసులతో కచేరీలు నిర్వహిస్తారు.. పేరున్న కళాకారులంతా అందులో పాల్గొన్నారు ఒక్క గానగంధర్వుడు జేసుదాసు తప్ప.. కారణం ఆయనకు ఆహ్వానం రాకపోవడమే! ఇప్పుడు ఆలయ బాధ్యతలు మళ్లీ ట్రావెన్‌కోర్‌ రాజవంశీకుల చేతుల్లోకి వెళ్లాయి కాబట్టి జేసుదాసు కల నెరవేరదేమో!