ఇదొక అమానవీయ ఘటన.. అనాథ మృతదేహాన్ని చెత్తబండిలో ఇలా…

Outrage Over Orphan Dead Bodies Shifted To Cemeteries In Garbage Trucks, ఇదొక అమానవీయ ఘటన.. అనాథ మృతదేహాన్ని చెత్తబండిలో ఇలా…

మాయమవుతున్నడమ్మా.. మనిషన్నవాడు అనే మాటకు ఇది మరో నిదర్శనం. కనీసం మానవత్వమన్నది ఏకోశానా కనిపించని సంఘటనలు అనేకం బయటపడుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అమానవీయ ఘటన జరిగింది. ఫుట్‌పాత్‌పై చనిపోయిన ఒక అనాథ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది చెత్త తరలించే ట్రాలీలో వేసి తరలించారు. ఈ దృశ్యాన్ని ఎవరో ఒక వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రభుత్వాసుపత్రిలో రోగులను, చనిపోయిన మృతదేహలను తరలించేందుకు స్ట్రెచర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ హాస్పిటల్ సిబ్బంది ఈ విధంగా చెత్త బండిలో వేసి తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే అనాథ మృతదేహాల తరలించేందుకు రాజమహేంద్రవరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్‌ ఉచిత వాహనాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు రోటరీ కైలాసభూమి పేరుతో ఇప్పటికే ఎంతో సేవ చేస్తున్నాయి. కానీ తాజాగా జరిగిన ఈ ఘటనలో అనాథ మృతదేహం గురించి హాస్పిటల్ వర్గాలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, ఒకవేళ తమకు తెలిసి ఉంటే ఈవిధంగా జరిగేది కాదన్నారు రోటరీ క్లబ్ నిర్వాహకులు.

ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అమానవీయ సంఘటనకు సంబంధించి స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  ఏదిఏమైనా కనీసం మానవత్వమన్నది లేకుండా ఒక అనాథ మృతదేహాన్ని చెత్త బండిలో తరలించంపై హాస్పిటల్ వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *