Punjab Politics: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగలదా? బీజేపీ ఆశలు ఫలిస్తాయా?

ఇప్పుడు జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఓ రకంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ లాంటివి. సార్వత్రిక ఎన్నికలకు ముందు మరికొన్ని...

Punjab Politics: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగలదా? బీజేపీ ఆశలు ఫలిస్తాయా?
Politics
Balu

| Edited By: Ravi Kiran

Feb 08, 2022 | 3:20 PM

ఇప్పుడు జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఓ రకంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ లాంటివి. సార్వత్రిక ఎన్నికలకు ముందు మరికొన్ని రాష్ట్రాలు కూడా అసెంబ్లీ ఎన్నికలు వెళుతున్నాయి. అవి మరో సెమీ ఫైనల్స్‌ లాంటివి.. గుజరాత్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలంగాణలు కూడా ఇంపార్టెంటే! ఆ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను బట్టి సార్వత్రిక ఎన్నికలపై ఓ బేరీజు వేసుకోవచ్చు. దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలపై ముచ్చటించుకుందాం! ఉత్తరప్రదేశ్‌పై సహజంగానే అందరి దృష్టి ఉంటుంది. పెద్ద రాష్ట్రామనే కాదు, ఉత్తరప్రదేశ్‌ ప్రభావం దేశమంతటా అంతో ఇంతో ఉంటుంది కాబట్టి.. అక్కడ రాజకీయ పార్టీల గెలుపోటములు కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి కాబట్టి. ఉత్తరప్రదేశ్‌ తర్వాత అందరి దృష్టి పంజాబ్‌పైనే ఉంది. యూపీ తర్వాత ఇదే పెద్ద రాష్ట్రం. ఈసారి అక్కడ పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాకపోతే రైతు చట్టాల కారణంగా అక్కడ బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేదు. అందుకే మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై ఆశలు పెట్టుకుంది. అమరీందర్‌తో పొత్తు పెట్టుకుంది. బీజేపీతో శిరోమణి అకాలీదళ్‌ తెగ తెంపులు చేసుకున్న తర్వాత అక్కడ కమలదళానికి ఓ పార్టీ అవసరం అయ్యింది. అందుకే అమరీందర్‌తో జతకట్టింది. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌, బీజేపీ కూటమి మధ్య జరుగుతున్న చతుర్ముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లో మొన్నటి వరకు ఎలాగైతే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయో అలాగే పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించాలనుకుంటోంది బీజేపీ అధినాయకత్వం.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు. అదో ఎన్నికల స్టంట్‌గానే వారు భావిస్తున్నారు.. పైగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మొన్నటి వరకు పోరాడిన రైతులలో అత్యధికులు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల కోపం తగ్గలేదన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. జనవరి 5న పంజాబ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదిని రైతులు అడ్డగించారు. హుసేనీవాలాలోని అమరుల స్థూప దగ్గర నివాళులు అర్పించడానికి రోడ్డు మార్గంలో వెళుతున్న ప్రధాని కాన్వాయ్‌ని పైరియాణా దగ్గర ఓ ఫ్లైఓవర్‌లో రైతులు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని నడిరోడ్డుపై ఓ 20 నిమిషాల పాటు వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది.. ఈ సంఘటనపై విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు బాగానే జరిగాయి. ఫిరోజ్‌పూర్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ప్రజలు పెద్దగా రాకపోవడంతో ప్రధాని తన పంజాబ్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని వెళ్లిపోయారంటూ విపక్షాలు ఆరోపించాయి. నిజానికి ఈ సంఘటన బీజేపీకి అడ్వాంటేజ్‌ కావాలి కానీ అది జరగలేదు. పైపెచ్చు బీజేపీ మరింత డీలా పడ్డది. అమరీందర్‌ బీజేపీని గట్టున పడేస్తారన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. బీజేపీ అధిష్టానం కూడా అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్‌ నుంచి అమరీందర్‌ బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత పంజాబ్‌లోని కీలక కాంగ్రెస్‌ నేతలంతా అమరీందర్‌ సైడుకు వస్తారని అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు చూడలేదు. కాకపోతే ఏదైనా విచిత్రం జరిగి అధికారంలోకి రాకపోతామా అన్న చిగురంత ఆశతో ఉంది. ఆ ఆశతోనే ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహిస్తోంది.

పంబాబ్‌లో సిక్కులతో పోలిస్తే హిందువుల శాతం తక్కువే. 60 శాతం సిక్కులు ఉంటే 39 శాతం హిందువులు ఉంటారు. అది కూడా పటాన్‌కోట్‌, జలంధర్‌, హోషియార్‌పూర్‌, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటారు. నిజానికి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఈ జిల్లాల నుంచే ఎక్కువగా పోటీ చేసేది. ఇప్పుడు మాత్రం అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇవాళ కాకపోతే రేపైనా అక్కడ బలపడాలన్నది బీజేపీ వ్యూహం. బీజేపీ 68 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. కూటమిలో ఉన్న పంజాబ్‌ లోక్ కాంగ్రెస్‌ 34 స్థానాల నుంచి , శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌) 15 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ప్రతి సభలోనూ సిక్కుల కోసం ప్రధాని మోదీ ఏం ఏం చేశారో చెప్పుకొస్తున్నారు బీజేపీ నేతలు. గురుద్వారాలకు విదేశీ విరాళాలు వచ్చేట్టు చేశామని, గురుద్వారాల్లోని నిత్యాన్నదాన సత్రాలను జీఎస్‌టీ పరిధిలోంచి తప్పించామని బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు.

పంజాబ్‌ బీజేపీ నాయకుల ఆశలన్నీ ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలపైనే ఉన్నాయి. మోదీ ఛరిస్మా పని చేస్తే మెజారిటీ సీట్లు సాధించుగోలమన్న ధీమాతో కమలదళం ఉంది. మరోవైపు సీ ఓటర్‌-ఏబీపీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మాత్రం బీజేపీ కూటమికి మూడు నుంచి 11 సీట్లు మాత్రమే రావచ్చని చెప్పింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. ఆప్‌కు 55 నుంచి 63 సీట్ల వరకు రావచ్చట. రెండోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ 24 నుంచి 30 సీట్లకే పరిమితం కావాల్సి ఉంటుందని సర్వే వివరించింది. ఒక వేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే బీజేపీ కింగ్‌ మేకర్‌గా మారే అవకాశం ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu