UTTARPRADESH POLLING: యుపీలో రెండో దశ పోలింగ్ అత్యంత కీలకం.. బీజేపీకి కఠిన పరీక్ష.. ఎస్పీకి చీలిక భయం..

UTTARPRADESH POLLING: యుపీలో రెండో దశ పోలింగ్ అత్యంత కీలకం.. బీజేపీకి కఠిన పరీక్ష.. ఎస్పీకి చీలిక భయం..
Politics

ఆ నాలుగు రాష్ట్రాలు ఒకెత్తు.. ఆ ఒక్క రాష్ట్రం ఒకెత్తు. ఎస్.. దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నది.. చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నది ఉత్తర ప్రదేశ్ పైనే.

Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Feb 13, 2022 | 6:51 PM

UTTARPRADESH POLLING CRUCIAL PHASE FOR BJP AND SAMAJWADI PARTY: ఆ నాలుగు రాష్ట్రాలు ఒకెత్తు.. ఆ ఒక్క రాష్ట్రం ఒకెత్తు. ఎస్.. దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నది.. చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నది ఉత్తర ప్రదేశ్ పైనే. నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల కంటే ఆ ఒక్క రాష్ట్రంలోనే స్థానాల సంఖ్య ఎక్కువ. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 403 సీట్లున్నాయి. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న తొలి విడతగా 58 సీట్లకు పోలింగ్ పూర్తైంది. రెండో విడత పోలింగ్ ఫిబ్రవరి 14వ తేదీన జరగబోతోంది. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. రెండో విడత పోలింగ్ జరుగుతున్న 55 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే ఫలితాలను నిర్దేశించనున్నారు. కారణం నిర్ణాయక స్థాయిలో ముస్లిం ఓటర్లుండడమే. ముస్లిం ఓటర్లు అధికంగా వున్న ఈ 55 నియోజకవర్గాలకు 2017లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 38 సీట్లలో బీజేపీ గెలుపొందింది. ముస్లింలలో బాగా పట్టుందని భావించే సమాజ్ వాదీ పార్టీ 15 సీట్లకు, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లకు పరిమితమయ్యాయి. ముస్లింల ప్రాతినిధ్యం అధికంగా వున్న జిల్లాల్లోను బీజేపీ గెలుపొందడానికి కారణం.. అక్కడ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడమేనని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు తేల్చారు. మరి ఈసారి కూడా ముస్లింల ఓట్లు చీలిపోయి బీజేపీకే ప్రయోజనం కలుగుతుందా ? లేక ముస్లింలు సంఘటితంగా వుండి బీజేపీని ఓడిస్తారా అన్నదానిపైనే యుపీ ఎన్నికల్లో జయాపజయాలు ఆధారపడి వుంటాయి. కాకపోతే ఈసారి ముస్లింల ఓట్ల కోసం రెండు పార్టీలే పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. పేరుకు బీఎస్పీ బరిలో వున్నా.. పెద్దగా యాక్టివ్ ప్రచారం కనిపించడం లేదు. అదేసమయంలో ముస్లింలను ఏకీకృతం చేయడంలో ఎస్పీ.. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ 55 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఎస్పీకే పడే సంకేతాలున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

రెండో విడతలో పోలింగ్ జరుగుతున్న 9 జిల్లాలు పశ్చిమ యుపీ, రోహిల్ ఖండ్ ఏరియాకు చెందినవి. మొదటి దశ పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ ఏరియాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన ప్రాంతాలున్నాయి. అక్కడ బీజేపీకి ఎదురైన సవాలు కంటే రెండో విడతలో పోలింగ్ జరుగుతున్న పశ్చిమ యుపీ, రోహిల్ ఖండ్ ఏరియాలో బీజేపీ పెద్ద సవాలును ఎదుర్కొంటోందంటున్నారు. సహరాన్ పూర్, రాంపూర్ జిల్లాల్లో ముస్లింల ఓట్లు పెద్ద సంఖ్యలో వున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ముస్లింలు, జాట్లు, దళితులు ఏకమైన ఫలితాలను శాసించే వారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అఖిలేశ్ యాదవ్ వ్యూహాత్మకంగా ఆర్.ఎల్.డీ.తో పొత్తు పెట్టుకున్నారు. కూటమిలోకి మహాన్ దళ్ ని కలుపుకున్నారు. మహాన్ దళ్ నేత కేశవ్ దేవ్ మౌర్యకు పశ్చిమ యూపీ, రోహిల్ ఖండ్ ఏరియాలో తిరుగులేని నేతగా పేరుంది. ఈ రెండు ప్రాంతాల్లోని కోయిరీలు, సైనీలు, మౌర్యులు, శాక్యులను కేశవ్ దేవ్ తీవ్రంగా ప్రభావితం చేయగలరని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా సంబల్, బధాయు జిల్లాల్లో అఖిలేశ్ కుటుంబీకుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఇన్నీ సానుకూలాంశాలు కలిగిన ఎస్పీ కూటమికి బీజేపీకి రాజీనామా చేసి.. ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూడా తోడయ్యారు. ఈ ఓబీసీ నేత ఈ ప్రాంతానికి చెందిన వారే. ఆయన ప్రభావం కూడా బాగానే వుంటుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కొనసాగి.. మొన్నీమధ్యే ఎస్పీలో చేరిన ముస్లిం నేత ఇమ్రాన్ మసూద్‌కు రెండో విడత పోలింగ్ జరుగుతున్న ఏరియాలో బాగానే పట్టుంది. ఇవన్నీ తమకు కలిసొచ్చే అంశాలని భావిస్తున్న ఎస్పీ మొత్తం 55 సీట్లలో 35 సీట్లను తాము గెలుచుకోవడం ఖాయమన్న అంచనాల్లో వున్నారు.

కాగా రెండో విడత పోలింగ్ జరుగుతున్న ఏరియాలో ఏకంగా 38 సీట్లను గత ఎన్నికల్లో గెలుచుకున్న బీజేపీకి ఆనాడు ముజఫర్ పూర్ అల్లర్లు బాగా లాభించాయి. ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించకపోవడంతో కమలనాథులు వర్రీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ పూర్‌తో పాటు కైరానాలో జరిగిన అల్లర్లను తమకు అనుకూలంగా మలచుకోవడం వల్లనే 2017లో బీజేపీ లాభపడిందని విశ్లేషకులు తేల్చారు. చెరుకు బిల్లుల చెల్లింపు, నిరుద్యోగ సమస్యలు ఈ ఏరియాలో బీజేపీకి ప్రతికూలంగా మారతాయని వినిపిస్తోంది. అదేసమయంలో సుదీర్ఘంగా సాగిన వ్యవసాయ చట్టాల వ్యతిరేకత, ముస్లిం ఓటర్లు సంఘటితం కావడం కూడా బీజేపీకి ప్రతికూలాంశాలేనని అంటున్నారు. మొత్తం మీద ప్రతికూలాంశాలే అధికంగా వుండడంతో రెండో దశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో BJP కఠిన పరీక్ష ఎదుర్కోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే బీజేపీకి సానుకూలంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముస్లింల ఓట్లు అస్సలు చీలకూడదని ఎస్పీ కూటమి భావిస్తోంది. అందుకు తగినట్లుగా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే.. ఇదే ఏరియాపై బీఎస్పీ ఓ వైపు, అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అందుకే బీఎస్పీ ఏకంగా 23 సీట్లను ముస్లింలకు కేటాయించింది. అది కూడా స్థానికంగా ప్రభావితం చేయగల అభ్యర్థులనే బరిలోకి దింపింది బీఎస్పీ. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం వర్గానికి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించింది. ఈ క్రమంలో ముస్లింల ఓట్లు పెద్ద ఎత్తున చీలితే అది పరోక్షంగా బీజేపీకి లాభిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తం 55 సీట్లలో 25 సీట్లలో ముస్లింలే నిర్ణయాత్మకం. ఈక్రమంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు వారి ఓట్లకు ఎలా గాలమేయాలా అన్న వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. వారి వ్యూహాలు వర్కౌట్ అయితే.. పరోక్షంగా బీజేపీకి లాభించే అవకాశాలు లేకపోలేదు. యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలోని కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు జితిన్ ప్రసాద, సురేశ్ ఖన్నా, ఛత్రపాల్ సింగ్ గంగ్యాం, మహేశ్ చంద్ర గుప్తా, బీజేపీ నేషనల్ క్యాషియర్ రాజేశ్ అగర్వాల్ వంటి ముఖ్య నేతలు రెండో దశలో తమ అదృష్టాన్ని తేల్చుకోబోతున్నారు. ఈక్రమంలో రెండో దశ పోలింగ్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu