TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. పార్టీని వీడుతూ రేవంత్‌నే టార్గెట్ చేస్తున్న నేతలు.. మారనున్న మరిన్ని సమీకరణాలు

ఇంత జరుగుతున్నా వెంకట్ రెడ్డికి క్లారిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ కనీసం ప్రయత్నం చేయకపోవడంతో వెంకట్ రెడ్డిని వదిలేసుకునేందుకే ఆయన రెడీ అవుతున్న సంకేతాలు వెలువడ్డాయి.

TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. పార్టీని వీడుతూ రేవంత్‌నే టార్గెట్ చేస్తున్న నేతలు.. మారనున్న మరిన్ని సమీకరణాలు
Revanth Reddy
Follow us

|

Updated on: Aug 05, 2022 | 7:39 PM

TELANGANA CONGRESS IN CRITICAL SITUATION AS MANY SENIOR LEADERS QUITING: మునుగోడు మంట తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇంకా తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఆయన ఆగస్టు ఆరో తేదీన అపాయింట్‌మెంటు కోరితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 8వ తేదీన అపాయింట్‌మెంటు ఇచ్చారు. సో, ఆయన రాజీనామా వాయిదా పడింది. ఈలోగా ఢిల్లీ (Delhi) వెళ్ళి బీజేపీ (BJP)లో నెంబర్ టూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ని కలిసారాయన. ఆగస్టు 21వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తారని, ఆరోజునే తనతోపాటు మరికొందరు బీజేపీలో చేరతామని రాజగోపాల్ (Komatireddy Rajagopal) వెల్లడించారు. హైదరాబాద్ (Hyderabad) రాగానే అసెంబ్లీకి వెళతానని, స్పీకర్ వుంటే ఆయనకు, లేకపోతే అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇస్తానని కూడా ఆయన చెప్పేశారు. మరోవైపు రాజగోపాల్ కామెంట్లకు జవాబిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revant Reddy) చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ సోదరుడు వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)లో ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేశాయి. రాజగోపాల్ వెళ్ళిపోయినా తాను పార్టీలో వుంటానంటుంటే.. తనను, తన సోదరుడు రాజగోపాల్‌ని ఒకగాటన కట్టి ‘‘మీరు’’ అంటూ సంబోధించి బ్రాండింగ్ చేయడంపై వెంకట్ రెడ్డి.. రేవంత్‌ని క్షమాపణ కోరారు. ఆ తర్వాత ఆయనే ఓ మెట్టుదిగి.. క్షమాపణ చెప్పే విషయాన్ని రేవంత్ విచక్షణకు వదిలేస్తున్నానని అన్నారు. ఇంత జరుగుతున్నా వెంకట్ రెడ్డికి క్లారిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ కనీసం ప్రయత్నం చేయకపోవడంతో వెంకట్ రెడ్డిని వదిలేసుకునేందుకే ఆయన రెడీ అవుతున్న సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు తమ్ముని బాటలోనే వెంకట్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లోకి వెళతారన్న ప్రచారం జోరందుకుంది. దీనిని వెంకట్ రెడ్డి డైరెక్టుగా ఖండించకపోవడంతో ఆ ప్రచారమే నిజమవుతుందా అనిపిస్తోందిపుడు. ఇదిలా వుండగా.. కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా వున్న డా. దాసోజు శ్రవణ్ (Dr. Dasoju Sravan) సడన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ (Khairatabad) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రవణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన విజయారెడ్డి (దివంగత నేత పీజేఆర్ కూతురు)కి ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వడం కన్‌ఫర్మ్ కావడంతో శ్రవణ్ పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు. నిజానికి గత ఏడాదికాలంగా (రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన నుంచి) శ్రవణ్ పార్టీలో కాస్త సైలెంట్ గానే వున్నారు. మొన్న మే 5వ తేదీన రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరైన ఓరుగల్లు బహిరంగ సభలో అధినేత ప్రసంగాన్ని శ్రవణే అనువదించాలి. కానీ ఆ బాధ్యత ఎమ్మెల్యే శ్రీధర్‌కు ఇవ్వడం కూడా శ్రవణ్‌ను కలవరపరిచిందంటున్నారు. అయితే, ఆయన పార్టీ వీడకుండా చూసేందుకు కోదండరెడ్డి (Kodanda Reddy), మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తదితరుల కాంగ్రెస్ బృందం తుది క్షణం వరకు ప్రయత్నించింది. ఆగస్టు 5న సాయంత్రం 4 గంటలకు శ్రవణ్ బంజారాహిల్స్‌ (Banjarahills)లోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే సరిగ్గా అదేసమయంలో కోదండరెడ్డి, మహేశ్ కుమార్ అక్కడి వచ్చి శ్రవణ్‌తో సంప్రదింపులు జరిపారు. బుజ్జగించేందుకు ప్రయత్నించారు. దాంతో శ్రవణ్ ప్రెస్ మీట్ ఆలస్యమైంది కానీ.. పార్టీ వీడాలన్న ఆయన నిర్ణయం మాత్రం మారలేదు. రాయబారం ఫలించకపోవడంతో కోదండరెడ్డి, మహేశ్ కుమార్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చిన శ్రవణ్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ వైఖరి వల్లనే తెలంగాణ కాంగ్రెస్ మరింత దిగజారిపోతోందని, వీక్ అవుతోందని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్న రేవంత్.. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీకి చిరకాలంగా సేవలందిస్తున్న వారికి చెక్ పెట్టేలా, నష్టం జరిగేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీని వీడుతున్న వారంతా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం విశేషం. సీనియర్లకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న రేవంత్ వల్ల పార్టీ మరింత బలహీన పడుతుందన్నది కోమటిరెడ్డి బ్రదర్స్‌తోపాటు దాసోజు శ్రవణ్ మాట. ఇక తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చెరుకు సుధాకర్ వ్యవహారం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు, ఆనాటి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ని గెలిపించేందుకు చెరుకు సుధాకర్ గౌడ్ ప్రయత్నించారని, ఆయన్ను తన ప్రమేయం లేకుండా, కనీసం తనకోమాట చెప్పకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారన్నది వెంకటరెడ్డి మాట.

ఇదిలా వుంటే, రాజగోపాల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగానే ఆగమేగాల మీద మునుగోడు నియోజకవర్గం (Munugodu Segment) కోసం సమన్వయ కమిటీని నియమించారు టీపీసీసీ అధ్యక్షుడు. అయితే ఆ కమిటీలో ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాకు చెందిన రాజకీయ ఉద్ధండులు జానారెడ్డి (Janareddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట రెడ్డి తదితరుల పేర్లు లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ ముగ్గురిలో వెంకటరెడ్డి.. రేవంత్‌పై కస్సుబుస్సులాడుతుండగా మిగిలిన ఇద్దరు ఆగస్టు 5వ తేదీన చండూరులో జరిగిన కాంగ్రెస్ శ్రేణుల భేటీలో పాల్గొన్నారు. ఇది రేవంత్ రెడ్డికి కాసింత ఊరట నిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. అయితే, వెంకటరెడ్డి విషయంలో రేవంత్ వైఖరి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ పార్టీ వీడుతూ చేసిన కామెంట్లకు స్పందించిన రేవంత్ అనవసరంగా వెంకటరెడ్డిని కెలికారన్న అభిప్రాయం గాంధీ భవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పోనీ కెలికితే కెలికారు.. వెంకటరెడ్డి క్లారిఫికేషన్ అడిగినపుడన్నా రేవంత్ తన ఉద్దేశం కోమటిరెడ్డి బ్రదర్స్‌ని కలిపి కామెంట్ చేయడం కాదని రేవంత్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. తన బ్రాండ్ ఇమేజ్‌పే చేసిన కామెంట్లను ఉపసంహరించుకోవడమో, లేక సారీ చెప్పడమో రేవంత్ రెడ్డి విచక్షణకు వదిలేస్తున్నానంటూ వెంకటరెడ్డి అన్నప్పటికీ రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఇది వెంకటరెడ్డికి మరింత ఎంబర్రాస్సింగ్ మారి, మాటల్ని మరింత పదునెక్కించారని పలువురు భావిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను తరిమేసి.. తెలంగాణ కాంగ్రెస్‌ను చంద్రబాబు కాంగ్రెస్‌గా రేవంత్ రెడ్డి మారుస్తున్నారని ఇటీవలి కాలంలో పార్టీని వీడిన వారనడం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలో అధికారానికి రావడం కల్ల అని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.

ఇక ఓవైపు టీఆర్ఎస్ (TRS Party), ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలమేస్తున్న కమలం పార్టీ వర్గాలు తాజా పరిణామాలపై మస్తు ఉత్సాహంతో స్పందిస్తున్నారు. రాజగోపాల్ ఆగస్టు 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆరోజు తనతోపాటు మరికొందరు పార్టీలో చేరతారన్నది ఆయన మాట. మరోవైపు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వెంకటరెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాస్త గట్టిగానే చెప్పారు. మరి ఆయన ఫ్యూచర్ ఏంటన్నది ఇక తేలాల్సి వుంది. ఇక దాసోజు శ్రవణ్ విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారా ? లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అన్నది క్లారిటీ రాలేదు. కాకపోతే.. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించిన శ్రవణ్ అటు రేవంత్ పైనా, ఇటు కేసీఆర్‌పైనా కామెంట్స్ చేశారు. సో.. ఆయన ఆ రెండు పార్టీల్లో చేరకపోవచ్చని, ఇక మిగిలింది బీజేపీనే కాబట్టి అందులోనే చేరతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సీటు కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినపుడు అక్కడ చిరకాలంగా పోటీ చేస్తూ, 2014లో ఓసారి విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిని కాదని శ్రవణ్‌కు ఖైరతాబాద్ బీజేపీ టిక్కెట్ ఇవ్వడం కాస్త కష్టసాధ్యమే. కానీ, బీజేపీలో అధిష్టానానిదే తుది మాట. చింతల రామచంద్రారెడ్డి సంఘ్ పరివార్‌ కనుసన్నల్లో కొనసాగే వ్యక్తి కాబట్టి, ఆయనకు నచ్చచెప్పి శ్రవణ్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక పది మంది వరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా వున్నారంటూ బండి సంజయ్ చేసిన ప్రకటన వెనుక వ్యూహంపైనా తెలంగాణవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంకా ఏడాదికిపైగా పదవీ కాలం వున్న తరుణంలో పలు ప్రయోజనాలందించే అధికారపార్టీని కాదని బీజేపీలో చేరే ఎమ్మెల్యేలు ఎవరా అన్న అంశం ఆసక్తి రేపుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకే చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సోదరుడు ప్రదీప్ రావు (Errabelli Pradeep Rao) త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా కమలం పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఆగస్టు మాసం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను చెప్పుకోదగిన స్థాయిలో మార్చే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.